ప్రాణాలు తీస్తున్న మద్యం వ్యసనం
బాడంగి: పల్లెలు, పట్టణాల్లో విచ్చలవిడిగా దొరకుతున్న మద్యానికి కొందరు బానిసలుగా మారుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు మత్తులోనే జోగుతున్నారు. మద్యం కొనుగోలుకు అవసరమైన రూ.200, 300లకు కన్నవారు, బంధువులు, తోబుట్టువులతో గొడవకు దిగుతున్నారు. డబ్బులు చేతికందేవరకు వాగ్వాదం చేస్తున్నారు. మద్యం వద్దు అని చెప్పిన వారిపై విచక్షణ కోల్పోయి దాడులకు తెగబడుతున్నారు. కన్నవారి ప్రాణాలు తీస్తున్నారు. బాడంగి మండలంలో మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు సొంత తండ్రులను హతమార్చిన ఘటనలు వరుసగా జరగడంతో ప్రజలు ఉలికిపాటుకు గురవుతున్నారు. మద్యం మహమ్మారి పేద, మధ్యతరగతి కుటుంబాలను పొట్టనపెట్టుకుంటోందంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎక్కడికక్కడే మద్యం దొరకడంతో జీవితాలు నాశనమవుతున్నాయంటూ వాపోతున్నారు. గత నెల 9వ తేదీన మద్యం కొనుగోలుకు డబ్బులివ్వలేదన్న కోపంతో బాడంగి మండల కేంద్రంలోని సినిమా కాలనీకి చెందిన భువనగిరి లక్ష్మణరావు తన తండ్రి రాజేశ్వరరావును చెప్పులకు మేకులు చరిచే గూటంతో తల, చెవిపై మోది హత్య చేశాడు. శనివారం ఈ ఘటన మరువకముందే గొల్లాదిలో మద్యంమత్తులో మామిడి రాము అనే వ్యక్తి పక్షవాతంతో రెండేళ్లుగా మంచంపట్టిన తండ్రి మామిడి సత్యంను శనివారం కత్తితో తలనరికి హత్యచేశాడు. వరుస హత్యలతో మండల ప్రజలు బేంబేలెత్తిపోతున్నారు. కన్నకొడుకులే కసాయివారైతే ఎవరేమి చేస్తారంటూ నిట్టూరుస్తున్నారు. ఈ ఘటనలను చూసిన పోలీసులు సైతం ఏం చేస్తే ఈ హత్యలు ఆగుతాయన్న ఆలోచనలో పడ్డారు.
మద్యం డబ్బుల కోసం కన్నవారితో వాగ్వాదం
మత్తులో విచక్షణ కోల్పోయి ప్రాణాలు తీస్తున్న వైనం
వరుస ఘటనలతో ఉలికిపాటు
విచ్చలవిడిగా మద్యం అమ్మకాలపై ఆందోళన


