తక్కువ ధరకే ధాన్యం విక్రయం
గ్రామాల్లో చేలు నేలవాలిపోవడం.. చాలా వరకు నీటిలో ఉండిపోవడంతో యుద్ధప్రాతిపదికన యంత్రాలు పెట్టి కోతలు పూర్తి చేసి తరలిస్తున్నారు. ధాన్యమింకా పచ్చిగానే ఉంది. దీనివల్ల అనుకున్న ధర రావడం కష్టంగా మారుతోంది. దీనికితోడు యంత్రాలకు రూ.వేలల్లో ఖర్చు చేస్తున్నారు. పాలకొండ మండలంలో ఎకరా విస్తీర్ణంలో కోతకు యంత్రానికి రూ.2,600లు రైతులు చెల్లిస్తున్నారు. ఎకరాలో చేయడానికి గంటకుపైగా సమయం పడుతోంది. ధాన్యాన్ని ట్రాక్టర్లలో పంపించి కొంత మంది ఆరబెట్టే ప్రయత్నం చేయగా.. ఇంకొందరు రైతులు నేరుగా వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఇదే అదునుగా దళారులు, వ్యాపారులు అప్పుడే గ్రామాల్లో ట్రాక్టర్లతో సిద్ధంగా వాలిపోతున్నారు. పంట దెబ్బతినడం.. పచ్చిగా ఉండటం వల్ల మద్దతు ధర రాదని.. లేదంటే తక్కువ ధరకు అమ్ముకోవాలని రైతులు కిలాన గోవింద, కిలాన ఈశ్వరరావు, దాసిరెడ్డి రామకృష్ణ తదితరులు వాపోతున్నారు.


