
క్రీడాకారిణి భవానీకి జేసీ అభినందనలు
విజయనగరం: కజకిస్థాన్‌లో జరిగిన జూనియర్ ఆసియన్ చాంపియన్ షిప్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో వరుసగా 3 బంగారు పతకాలను సాధించిన జిల్లాలోని కొండకరకాం గ్రామానికి చెందిన క్రీడాకారిణి రెడ్డి భవానిని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ అభినందించారు. ఈ మేరకు తన చాంబర్‌లో మంగళవారం ఆమెను దుశ్శాలువతో సత్కరించారు. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ తరఫున రూ.25వేల నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. వచ్చే ఒలింపిక్స్ పోటీల్లో పతకాన్ని సాధించి, దేశానికి, జిల్లాకు మంచిపేరు తేవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాధికారి వెంకటేశ్వరరావు, కోచ్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
భవానీకి పౌరవేదిక సత్కారం
విజయనగరం మండల పరిధిలోని కొండకరకాం గ్రామంలో అతి సామాన్య కుటుంబంలో జన్మించిన రెడ్డి భవాని ఇటీవల కజికిస్థాన్‌లో జరిగిన ఏషియన్ గేమ్స్ లో వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో మూడు బంగారు పతకాలను సాధించి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ ప్రతిష్టను పెంచిందని జిల్లా పౌర వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ అన్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా పౌర వేదిక ఆధ్వర్యంలో బంగారు పతకాల విజేత ఏషియన్ వెయిట్ లిఫ్టర్ రెడ్డి భవానీని ఘనంగా సన్మానించారు. భవాని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి తగిన ఆర్థిక సహాయం చేయాలని ఈ మేరకు కలెక్టర్ డాక్టర్ బీఆర్.అంబేడ్కర్, జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు లకు పౌరవేదిక తరఫున వినతిపత్రాలు పంపిస్తామన్నారు. ఈ సత్కారసభలో భవానీ కోచ్ ఆనంద్, పౌర వేదిక ప్రతినిధులు జలంత్రి రామచంద్ర రాజు, తుమ్మగంటి రాంమోహన్, ధవళ కొండబాబు, అల్లంశెట్టి నాగభూషణం, పోలుపర్తి అప్పారావు, థాట్రాజు రాజారావు, జాగరపు ఈశ్వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

క్రీడాకారిణి భవానీకి జేసీ అభినందనలు