
15 నుంచి పారిశుధ్య పక్షోత్సవాలు
పార్వతీపురంటౌన్:
పారిశుధ్యం, వ్యక్తిగత పరిశుభ్రతను ప్రోత్సహించడానికి ఈ నెల 15 నుంచి ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ కార్యక్రమాన్ని పార్వతీపురం మన్యం జిల్లావ్యాప్తంగా నిర్వహించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జూలై 15 నుంచి 30వ తేదీ వరకు పారిశుధ్య పక్షోత్సవాలు జరుగుతాయని, ప్రజలను కూడా ఇందులో భాగస్వాములను చేయాలని కలెక్టర్ సూచించారు. వ్యర్థాలను పారవేయడం, నిర్వహణ, వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత, అవగాహన ప్రచారాలు, శుభ్రపరిచే డ్రైవ్‌లు, పారిశుధ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, వ్యక్తిగత మరుగుదొడ్లను వినియోగించుకునేలా చేయడం వంటి వివిధ అంశాలపై ప్రత్యేక దష్టి సారించాలని చెప్పారు. ఈ మేరకు కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పారిశుధ్య పక్షోత్సవాలు, స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల నిర్వహణపై సంబంధిత అధికారులతో కలెక్టర్ బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 15 నుంచి 30వరకు పారిశుధ్య కార్యక్రమాలు జరుగుతాయని, ఇందుకు సంబంధించిన ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని పంచాయతీ, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పెద్దఎత్తున పారిశుధ్య కార్యక్రమాలు జరగనున్నందున అందుకు తగిన విధంగా పారిశుధ్య కార్మికులను, బ్లీచింగ్, చెత్తను తరలించేందుకు అవసరమైన వాహనాలు, ఇతర సామగ్రిని పంచాయతీ తీర్మానంతో ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ డ్రైవ్‌లో రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని, ఇందుకు ఉపాధిహామీ ద్వారా చదును చేసుకునే అవకాశం ఉందని సూచించారు. అవసరమైన ప్రదేశాల్లో జేసీబీలను అద్దె ప్రాతిపదికన తీసుకోవాలని కమిషనర్లను ఆదేశించారు. ఈ పక్షోత్సవాల్లో మురుగు కాలువలను శుభ్రం చేయడం, బ్లీచింగ్ చల్లడం, దోమలు వ్యాప్తి చెందకుండా స్ప్రేయింగ్ చేయించడం వంటివి కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ప్రతి గ్రామంలో గ్రామ పారిశుధ్య కమిటీ సమావేశాలను నిర్వహించి, గ్రామంలో చేపట్టవలసిన పనులపై తీర్మానం చేసుకోవాలని, అందుకు తగిన విధంగా పనులు నిర్వహించుకోవాలని స్పష్టం చేశారు.
వినియోగంలోకి చెత్త సంపద కేంద్రాలు
గ్రామాల్లో ఉండే రక్షిత మంచినీటి పథకాలను శుభ్రపరచడం, వాటికి మంచి రంగులు వేయించి, సాక్షి సంతకం తీసుకోవాలని తెలిపారు. నీటి పరీక్షలు నిర్వహించి, స్వచ్ఛమైన రక్షిత మంచినీటిని ప్రజలకు సరఫరా చేయాలన్నారు. గ్రామాల్లో ఉండే చెత్త నుంచి సంపద సేకరణ కేంద్రాలను పూర్తిగా వినియోగంలోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. ప్రతి నెలా మూడవ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేసేందుకు కృషిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి టి.కొండలరావు, మున్సిపల్ కమిషనర్లు సీహెచ్. వెంకటేశ్వర్లు, ఎస్‌జేవీ రతన్ రాజు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.ఎస్.భాస్కర రావు, ప్రోగ్రాం అధికారి డా. టి.జగన్మోహన్ రావు, డీఎల్డీఓ రమేష్ రామన్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలంతా భాగస్వాములు కావాలి
గ్రామాల్లో అవగాహన ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని, పారిశుధ్య లోపం వల్ల కలిగే దుష్ప్రభావాలను ప్రజలకు వివరించి, కార్యక్రమంలో భాగస్వాములయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లా మంత్రితో పారిశుధ్య కార్యక్రమాల పోస్టర్లను విడుదల చేయించాలని, పారిశుధ్య కార్మికులందరూ యాప్రాన్, మాస్క్, చేతికి గ్లౌజులు విధిగా వేసుకోవాలని చెప్పారు. జిల్లాలో మిషన్ కల్పవృక్ష కార్యక్రమం జరుగుతుందని, ఈ డ్రైవ్ లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టవచ్చని కలెక్టర్ హితవు పలికారు. గ్రామాల్లో నిర్మాణం పూర్తిచేసుకున్న సామాజిక మరుగుదొడ్లను ప్రారంభించుకోవాలని, వ్యక్తిగత మరుగుదొడ్ల వినియోగాన్ని ప్రజలకు వివరిస్తూ బహిరంగ మలవిసర్జనను విడనాడేలా ప్రతిజ్ఞ చేయించాలని పేర్కొన్నారు.
కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్