
గంజాయి, పోక్సో కేసులపై దృష్టి పెట్టండి
● నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ ఆదేశాలు
విజయనగరం క్రైమ్: పెరుగుతున్న గంజాయి కేసుల నివారణపై దృష్టి పెట్టాలని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని అన్ని స్టేషన్ల హౌస్ ఆఫీసర్లు, మూడు డివిజన్ల అధికారులతో ఎస్పీ వకుల్ జిందల్ బుధవారం నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. దర్యాప్తులో ఉన్న గ్రేవ్, నాన్‌గ్రేవ్, ఎన్డీపీఎన్, పోక్సో, అట్రాసిటి, మిస్సింగ్, రోడ్డు ప్రమాదాల కేసులను, లాంగ్ పెండింగ్ కేసులను ఈ సందర్భంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ ప్రజలకు శక్తి యాప్ గురించి అవగాహన కల్పించాలని ఇందుకు శక్తి టీమ్స్ మరింత విస్తృతంగా పని చేయాలని ఆదేశించారు. కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థినులకు సెల్ఫ్ డిఫెన్సు టెక్నిక్స్ నేర్పించేందుకు శక్తి వారియర్స్ టీమ్స్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని చెప్పారు.
ఫిర్యాదు దారులతో మర్యాదగా ప్రవర్తించాలి
మహిళలపై జరిగే అఘాయిత్యాలపై పోలీస్‌స్టేషనుకు వచ్చే ఫిర్యాదులపై వెంటనే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని, స్టేషన్‌లో ఫిర్యాదుదారులు వేచి ఉండకుండా చూడాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణ నియంత్రణపై దృష్టి పెట్టాలని, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నాలుగు చెక్ పోస్టుల వద్ద నిరంతరం వాహన తనిఖీలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. అనంతరం పలు కేసుల్లో శాఖాపరంగా ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ వకుల్ జిందల్ ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ పి. సౌమ్యలత, విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, బొబ్బిలి డీఎస్పీ జి.భవ్యరెడ్డి, చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు, మహిళా పిఎస్ డీఎస్పీ ఆర్.గోవిందరావు, డీటీసీ డీఎస్పీ ఎం.వీరకుమార్ ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.