
కచ్చితమైన సమాచారాన్ని అందజేయాలి : ఎస్పీ
పార్వతీపురం రూరల్: పోలీసు శాఖలో క్రియాశీలకమైన స్పెషల్ బ్రాంచ్ విభాగంలో పని చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందితో జి ఎస్పీ మాధవ్ రెడ్డి శనివారం తన కార్యాలయంలో సమావేశమై వారు క్షేత్ర స్థాయిలో నిర్వహించాల్సిన విధులపై దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా ఎస్‌బీ నిర్వహించాల్సిన విధులపై కొన్ని మార్గదర్శకాలు చేశారని డీజీపీ ఆలోచనల మేరకు జిల్లాలో వాటిని పరిగణనలోకి తీసుకొని జిల్లా ఎస్‌బీ సిబ్బంది విధులు నిర్వర్తించాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో స్పెషల్ బ్రాంచ్(ఎస్‌బీ) పోలీసుల పనితీరు చాలా క్రియాశీలకమన్నారు. కచ్చితమైన సమాచారాన్ని సేకరించేందుకు సోర్సు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు వారితో మమేకమై అభిప్రాయాలు తెలుసుకోవాలన్నారు. సేకరించిన విషయాలను రికార్డు రూపంలో భద్రపరుచుకోవాలని, వాటిని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని సూచించారు.
కార్యకలాపాలపై మరింత దృష్టి
గ్రామ, వార్డు స్థాయిలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు, రాజకీయ వివాదాలు అతిథుల రాకపోకల సమాచారం వారియొక్క ప్రతీ కార్యక్రమం, ధర్నాలు, కక్షలు, భూ తగాదాలు, మత సంబంధమైన గ్రూపుల యొక్క సమాచారం ముందస్తుగా సేకరించాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే సంఘటనలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ముందుగా గుర్తించి ఆ సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందించాలన్నారు. ప్రజలతో నిత్యం మమేకమవుతూ పక్షపాతి ధోరణి లేకుండా సక్రమంగా విధులు నిర్వహించాలని తెలిపారు. సమావేశంలో ఎస్‌బీ సీఐ రంగనాధం, ఎస్‌బీ ఎక్స్ సీఐ రమేష్, ఎస్‌ఐలు దినకర్, రాజు, శంకరరావు, ఇతర పోలీసు అధికారులు తదితర సిబ్బంది పాల్గొన్నారు.