విద్యార్థులకు రుచికర భోజనం | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు రుచికర భోజనం

Published Thu, May 30 2024 3:20 PM

విద్యార్థులకు రుచికర భోజనం

డీఈఓ పగడాలమ్మ

వీరఘట్టం: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు గోరుముద్ద పథకంలో భాగంగా మరింత రుచికరమైన మధ్యాహ్న భోజనం అందించడమే ప్రభుత్వ ధ్యేయమని పార్వతీపురం మన్యం జిల్లా విద్యాశాఖాధికారి జి.పగడాలమ్మ అన్నారు. తాజ్‌ హోటల్‌ చెఫ్‌లు రూపొందించిన వంటల తయారీ ప్రొగ్రాంపై వీరఘట్టం బాలుర ఉన్నత పాఠశాలలో వంట ఏజెన్సీ మహిళలకు బుధవారం ఒక్కరోజు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో డీఈఓ పాల్గొని పలు సూచనలు చేశారు. విద్యార్థులకు మెరుగైన పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం తాజ్‌ హోటల్‌ ఫార్ములాను అనుసరిస్తోందన్నారు. ప్రతి విద్యార్థి మధ్యాహ్న భోజనాన్ని పాఠశాలలోనే తినేందుకు ఇష్టపడేలా చేయడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఇంటి భోజనాన్ని మించి పాఠశాలలో వంటలు చేయాలని డీఈఓ సూచించారు. కొంతమంది వంట ఏజెన్సీ మహిళలు మాట్లాడుతూ వంటకు కావాల్సిన గ్యాస్‌ సిలిండర్లు అందజేయాలని కోరారు. శిక్షణ కార్యక్రమంలో రిసోర్స్‌ పర్సన్‌ ఆర్‌.శాంతికుమారి, మధ్యాహ్న భోజన పథకం ఏడీ పి.దామోదరరావు, జిల్లా కో–ఆర్డినేటర్‌ జి.సుగుణనాయుడు, వీరఘట్టం ఎంఈఓ కార్యాలయ సిబ్బంది, సీఆర్‌పీలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement