No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Tue, May 28 2024 11:00 AM

-

సీతంపేట/విజయనగరం ఫోర్ట్‌: నవధాన్యాల సాగు తో భూసారం పెరుగుతుందని ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ దిశగా రైతులను చైతన్య పరుస్తున్నారు. రసాయన ఎరువులు అధికంగా వినియోగంచడం వల్ల భూములు సారం కోల్పో తాయని... దీంతో భూసారం పెంచుకోవాల్సిన బాధ్యత అన్నదాతలపై ఉందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో రేపటి తరానికి సారవంతమైన భూములు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తూ, రైతులను ప్రోత్సహిస్తున్నారు.

94 వేల ఎకరాల్లో సాగే లక్ష్యం..

ఖరీఫ్‌ అనంతరం ఖాళీగా ఉన్న పంట చేలల్లో పచ్చిరొట్ట బదులు నవధాన్యాల సాగును ప్రోత్సహిస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలోని 15 మండలాల్లో 94 వేల ఎకరాల్లో నవధాన్యాల సాగు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయా మండలాల్లో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఇప్పటికే రైతుల నుంచి ఆమోదం తీసుకుని విత్తన గుళికలు తయారు చేసి అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొక్కజొన్న, జొన్న, మినుములు, పెసలు, ఉలవలు, చోడి, జీలుగు, జనుము, గోంగూర, తొటకూర, కొత్తిమీర, బీర, ఆనప, ఊదలు, కొర్రలు, తదితర విత్తనాలను నవధాన్యాలుగా పంటపొలాల్లో చల్లుతారు. 12 కిలోల విత్తన గుళికలను బంక మట్టితో కలిపి చల్లి, ఘన జీవామృతం పిచికారీ చేస్తారు. విత్తనాలను బంకమట్టితో కలిపి గుళికల రూపంలో వేయడం వల్ల పక్షులు తినడానికి వీలుండదు. దీంతో చల్లిన ప్రతి గింజా మొలకెత్తుతుంది.

పశువులకు మేతగా...

40 నుంచి 45 రోజుల పాటు ఏపుగా ఎదిగే నవధాన్యాలపై పంటను కోసం పశువులకు మేతగా ఉపయోగించవచ్చు. దీంతో పాడి బాగా అభివృద్ధి చెందుతుంది. పంటను పశువులకు వినియోగించగా... భూమిలోపల మిగిలిన దుబ్బులను ట్రాక్టర్‌తో కలియదున్నడం వల్ల భూమి గుల్లబారి, నీటి నిల్వ సామర్థ్యం పెరిగి సూక్ష్మపోషకాలు వృద్ధి భూసారం పెరుగుతుంది.

బీజామృతం తయారీ ఇలా...

దేశీ ఆవుపేడను పలచటి గుడ్డలో మూటకట్టి 20 లీటర్ల నీరు ఉన్న తొట్టెలో 12 గంటలు ఉంచాలి. ఒక లీటర్‌ నీటిని వేరే పాత్రలో తీసుకుని 50 గ్రాముల సున్నం కలిపి రాత్రంతా ఉంచి ఉదయాన్నే నానబెట్టిన పేడ మూటను చేతితో పిండి రసాన్ని నీటి తొట్టెలో కలపాలి. ఇలా వచ్చిన ద్రావణాన్ని 12 గంటల పాటు నిల్వ ఉంచి మరునాడు విత్తనాలకు పట్టించి నీడలో ఆరబెట్టి నాటితే ఏ రకమైన చీడపీడలు రాకుండా విత్తనాలు మొలకెత్తుతాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement