వైద్య కేంద్రం తరలింపుపై ప్రజాగ్రహం
చిలకలూరిపేట: గత మున్సిపల్ ఎన్నికలకు ముందు చిలకలూరిపేట పట్టణానికి మూడు కిలో మీటర్లలోపు ఉన్న గణపవరం, పసుమర్రు, మానుకొండవారిపాలెం గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేశారు. అనంతరం ఎన్నికలు నిర్వహించారు. విలీన గ్రామాలకు సంబంధించి కొత్తగా 8 వార్డులు ఏర్పడ్డాయి. గణపవరం, పసుమర్రు గ్రామాలకు సంబంధించి విలీనాన్ని వ్యతిరేకిస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. వ్యాజ్యం విచారణలో ఉన్న నేపథ్యంలో ఈ రెండు గ్రామాలకు సంబంధించి పన్ను వసూళ్లు, రికార్డుల నిర్వహణ ఆయా గ్రామ పంచాయితీలే నిర్వహించుకుంటున్నాయి. కానీ మానుకొండవారిపాలెం గ్రామానికి సంబంధించి ఎవరూ కోర్టును ఆశ్రయించలేదు. ఈ నేపథ్యంలో గ్రామానికి సంబంధించి పన్ను వసూళ్లు, అభివృద్ధి పనులు కూడా పురపాలక సంఘం వారే నిర్వహిస్తున్నారు. గ్రామంలోని ఎస్టీ కాలనీకి సంబంధించి పైపులైన్ ఏర్పాటు, గ్రామంలో రోడ్డు నిర్మాణం, వీధి దీపాల నిర్వహణ, పారిశుద్ధ్య పనుల నిర్వహణ వంటివి మున్సిపాలిటీ నిర్వహిస్తోంది. అక్కడ ఇప్పటికే కొనసాగుతూ ఉన్న, నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరైన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ విషయంలో మాత్రం వివాదం ఏర్పడింది.
అసలు కారణం ఇదే..
గ్రామంలోని పాత పంచాయతీ భవనంలో 2022లో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏర్పాటైంది. ఒక డాక్టర్, ఇద్దరు స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫార్మాసిస్ట్, శానిటరీ వర్కర్ విధులు నిర్వహిస్తున్నారు. కొత్త భవన నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలోనే ప్రస్తుతం గ్రామ సచివాలయం వద్ద స్థలం కేటాయించారు. నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. విలీన గ్రామాలకు సంబంధించి హైకోర్టులో వ్యాజ్యం పెండింగులో ఉందని... పట్టణంలోని ఆంజనేయస్వామి గుడి సమీపంలోని పాత ప్రభుత్వాసుపత్రి స్థలంలో యూపీహెచ్‌సీ భవనం నిర్మిస్తామని నవంబరు 29న నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో 16వ అంశంగా అజెండాలో పొందుపరిచారు. దీంతో సంబంధిత 11వ వార్డు కౌన్సిలర్ మానుకొండ మాధవి ఈ విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. గ్రామం నుంచి ఎవరూ కోర్టును ఆశ్రయించలేదని.. మున్సిపాలిటీలోనే కొనసాగుతామన్నారు. పన్నులు కూడా మున్సిపాలిటీ వారే వసూలు చేసుకుంటున్నారని గుర్తుచేశారు. వీటికి లేని అభ్యంతరం యూపీహెచ్‌సీ నిర్మాణానికి ఎందుకు వచ్చిందంటూ నిలదీశారు. దీనికి సంబంధించి వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు యూపీహెచ్‌సీ తరలింపును వ్యతిరేకిస్తూ మున్సిపల్ కమిషనర్‌కు డిసెంట్ నోట్ అందించారు.
తల్లీపిల్లల ఆసుపత్రి కోసం...
యూపీహెచ్‌సీ భవన నిర్మాణ విషయంలో వివాదం ఇలా ఉండగా... పాత ప్రభుత్వాసుపత్రి స్థలంలో తల్లీపిల్లల ఆసుపత్రి నిర్మించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. దీనికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వారు ఆసుపత్రి సాధన అఖిలపక్ష కమిటీగా ఏర్పడ్డారు. ఆసుపత్రి సాధనకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే సీఎం సహా పలువురికి వినతి పత్రాలు పంపారు. ఈ నేపథ్యంలో పాత ప్రభుత్వాసుపత్రి స్థలంలో తల్లీపిల్లల ఆసుపత్రి నిర్మిస్తారా? లేదా మానుకొండవారిపాలెంలో యూపీహెచ్‌సీ భవనం ఇక్కడికి తరలిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. గ్రామంలోనే యూపీహెచ్‌సీ భవనం నిర్మించి, పట్టణంలోని పాత ప్రభుత్వాసుపత్రి స్థలంలో తల్లీపిల్లల ఆసుపత్రి భవనం నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ పి.శ్రీహరిబాబును వివరణ కోరగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఇప్పటికే మానుకొండవారిపాలెం
గ్రామంలో యూపీసీహెచ్
కొత్త భవన నిర్మాణానికి
గతంలోనే నిధులు మంజూరు
మున్సిపాలిటీలో విలీనమైనా
తరలింపు యత్నాలపై వ్యతిరేకత
మానుకొండవారిపాలెంలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ తరలింపు ప్రయత్నాలపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇప్పటికే పురపాలక సంఘంలో విలీనమైన గ్రామంలో వైద్య సేవలు అందిస్తున్న హెల్త్ సెంటర్‌ను తరలించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో భవనానికి మంజూరై ఉన్న స్థలంలో కొత్త భవనం నిర్మించాలని కోరుతున్నారు.


