పీహెచ్‌సీకి ‘విభేదాల’ రోగం
మూడు నెలలుగా జీతాలు లేని వైనం ఫ్యామిలి ఫిజీషియన్ ప్రోగ్రామ్‌కు వైద్యాధికారి డుమ్మా ఆన్‌లైన్ కాని మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ పనితీరు వైద్యాధికారిపై డీఎంహెచ్‌వోకు సిబ్బంది ఫిర్యాదు
పాస్‌వర్డ్ కోసం వెతకడం వల్లనే విధులకు వెళ్లలేకపోయా
గత ప్రభుత్వ హయాంలో నలుగురు వైద్యులతో కళకళలాడిన అచ్చంపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) ఇప్పుడు గతి తప్పింది. మూడు నెలలుగా జీతాలు లేక సిబ్బంది వీధికెక్కారు. వైద్యాధికారిపై సిబ్బంది అంతా డీఎంహెచ్‌వోకు ఫిర్యాదు చేశారు. ఒక డాక్టర్ సస్పెండ్ కాగా, మరో డాక్టర్ తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
అచ్చంపేట: ఇంటింటికి వైద్యం (ఫ్యామిలి ఫిజీషియన్ ప్రోగ్రామ్) విధులు నిర్వహించాల్సిన వైద్యాధికారి తరచూ విధులకు ఎగనామం పెడుతున్నారు. ఒకప్పుడు వైఎస్సార్ హెల్త్ వెల్‌నెస్ సెంటర్స్‌గా పిలువబడే ఆయుష్మాన్‌భవ భవనాలలో పనిచేసే మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ (ఎంఎల్‌హెచ్‌ఎంఎస్) పనితీరును ప్రతి నెలా ఆన్‌లైన్ చేయవలసి ఉండగా వైద్యులు, సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడంతో ఆన్‌లైన్‌కు నోచుకోలేదు. వైఎస్సార్ ప్రభుత్వ హయాంలో రూ.1.50 కోట్లతో అచ్చంపేట పీహెచ్‌సీకి నూతన భవనం నిర్మించి నలుగురు వైద్యులను నియమించారు. ఆ నలుగురిలో ఇప్పుడు ఒకరు బదిలీకాగా, మరొకరు సస్పెండ్ అయ్యారు. ఒక పోస్టు ఖాళీగా ఉంది. మిగిలిన ఒక్కరూ ఓపీ చూసుకోవడానే పరిమితమైతే ఎఫ్‌పీపీ (ఫ్యామిలీ ఫిజీషియన్ ప్రోగ్రామ్)కి మరొక డాక్టర్ అవసరం ఉంది. దీంతో మాదిపాడు వైద్యాధికారి డాక్టర్ రాంబాబు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అచ్చంపేటలో విధులు నిర్వహిస్తున్నారు.
తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యాధికారి
డ్రాయింగ్ పవర్ ఉన్న మరో వైద్యాధికారి డాక్టర్ స్రవంతి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గత మూడు నెలలుగా జీతాలు రాకుండా వేధింపులకు గురిచేస్తున్నారని సిబ్బంది డాక్టర్ స్రవంతిపై జిల్లా అధికారికి ఫిర్యాదు చేశారు. ఇంటింటికి వెళ్లి వైద్యం నిర్వహించే ఫ్యామిలి పిజీషియన్ ప్రోగ్రామ్‌కు డాక్టర్ స్రవంతి తరచూ డుమ్మా కొడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆరోగ్య కేంద్రాలలో పనిచేసే హెల్త్ ప్రొవైడర్ స్థితిగతులను ప్రతినెల 25 నుంచి 30వ తేదీలోపు ఆన్‌లైన్‌లో నమోదుచేసి ఉన్నతాధికారులకు పంపాల్సిన బాధ్యత వైద్యాధికారిపై ఉంది. ఇక్కడ ఆవిధంగా నమోదు కావడం లేదు.
మూడు నెలలుగా జీతాలు లేక...
స్థానిక పీహెచ్‌సీలో పనిచేసి 12 మంది రెగ్యులర్, 15 మంది క్రాంట్రాక్టు సిబ్బందికి సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్ నెలలకు సంబంధించిన జీతాలు రాలేదు. తమపై అక్కసు వల్లనే డాక్టర్ స్రవంతి మూడు నెలలుగా జీతాలు వేయలేదంటూ వైద్య సిబ్బంది ఏకంగా గురువారం జిల్లా మెడికల్ అండ్ హెల్త్ అధికారి బి.రవికి ఫిర్యాదు చేశారు.
నాపై వచ్చే ఆరోపణలలో వాస్తవం లేదు. ఆన్‌లైన్‌కు సంబంధించిన పాస్‌వర్డ్‌ను గతంలో పనిచేసిన ఉద్యోగి చెప్పకపోవడం, దాని కోసం కంప్యూటర్ సెక్షన్‌లో వెతకడం వల్ల ఫ్యామిలి ఫిజీషియన్ ప్రోగ్రామ్‌కు వెళ్లలేకపోయా. యూడీసీ లేకపోవడం వల్ల సిబ్బందికి జీతాలు వేయడంలో జాప్యం జరిగింది. డీఎంఅండ్‌హెచ్‌వో ఆదేశాల మేరకు ఈనెల 10వ తేదీలోపు అందరికి జీతాలు వచ్చేలా పనిచేస్తా.
– డాక్టర్ స్రవంతి, వైద్యాధికారి


