కోటప్పకొండలో ప్రారంభమైన ఆరుద్రోత్సవ పూజలు
నరసరావుపేట రూరల్: కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం రాత్రి ఆరుద్రోత్సవం పూజలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పూలతో అలంకరించారు. శ్రీ మేధా దక్షిణామూర్తి మాలధారులు కొండకు చేరుకొని ఇరుముళ్ళు చెల్లించి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి స్వామివారికి ఆరుద్రోత్సవ అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ఈవో డి.చంద్రశేఖరరావు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.
యడ్లపాడు: మండలంలోని నాలుగు పురాతన ఆలయాలు అభివృద్ధి కానున్నాయి. పల్నాడు జిల్లాలోని 17 ఆలయాలకు రాష్ట్ర దేవదాయ శాఖ రూ.12.45 కోట్లు తాజాగా మంజూరు చేసింది. దీనిలో మండలంలోని మూడు గ్రామాల్లోని నాలుగు ఆలయాలకు రూ.289.56 కోట్లు నిధులు కేటాయింపు జరిగింది. దింతెనపాడు గ్రామంలోని చెన్నకేశవస్వామి ఆలయానికి రూ.కోటి, దండేశ్వరస్వామి గుడికి రూ.83.33 లక్షలు, తిమ్మాపురం చంద్రమౌళేశ్వర స్వామి ఆలయానికి రూ.56.25లక్షలు, కొండవీడు శివాలయానికి రూ.50 లక్షలు నిధులు మంజూరైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ నిధులకు స్థానిక ప్రజలు 33శాతం సొమ్మును జోడించి ఆయా పనులు చేపట్టాలని తెలిపారు. నిధులకు సంబంధించి పరిపాలనాపరమైన అనుమతులు కూడా ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
మాచవరం: కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో నీరు కలుషితం కావడంతో స్థానిక అధికారులు శనివారం శానిటేషన్ కార్యక్రమం చేపట్టినట్లు ఎంపీడీవో విష్ణు చిరంజీవి తెలిపారు. నది ఎగువ ప్రాంతాన రసాయన వ్యర్థాలు కలవడంతో నీరు కలుషితమై దుర్వాసన రావడం, నీరు ఆకుపచ్చ రంగులోకి మారడంతో పరివాహక ప్రాంత ప్రజలు భయాందోళనలు చెందుతున్నట్లు తెలిపారు. గత వారం రోజులుగా మండలంలోని రేగులగడ్డ , వెల్లంపల్లి, వేమవరం, గోవిందాపురం గ్రామ సమీప ప్రాంతాల్లో పులిచింతల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ దుర్వాసన రావడం, నదిలో నీటిని పశువులు తాగడంతో రోగాల బారిన పడటం ప్రజలు ఇబ్బందులకు గురి కావడంతో అప్రమత్తమైన జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలతో చర్యలు పడుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు నదిలో నీటిని వాడుకోవద్దని తెలియజేశారు.
తాడికొండ/గుంటూరు మెడికల్: రాజధాని అమరావతిలోని ‘విట్’ యూనివర్సిటీ ఫౌండర్ డాక్టర్ విశ్వనాథన్ జన్మదినం సందర్భంగా శనివారం మెగా వైద్యశిబిరం నిర్వహించారు. గుంటూరు మెడికల్ కాలేజి వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.శ్రీధర్ ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదాన ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించారు. రక్తదానం శిబిరం ద్వారా విట్ విద్యార్థులు 449 యూనిట్‌ల రక్తాన్ని గుంటూరు జీజీహెచ్‌కు అందించినట్లు డాక్టర్ శ్రీధర్ వెల్లడించారు.
కోటప్పకొండలో ప్రారంభమైన ఆరుద్రోత్సవ పూజలు
కోటప్పకొండలో ప్రారంభమైన ఆరుద్రోత్సవ పూజలు


