సైనికుల త్యాగాలు స్మరణీయం
నరసరావుపేట: దేశ రక్షణలో సైనికుల త్యాగాలు స్మరణీయమని జిల్లా కలెక్టర్, జిల్లా సైనిక బోర్డు చైర్మన్ కృతికా శుక్లా తెలిపారు. ఫ్లాగ్ డే సందర్భంగా శనివారం కలెక్టరేట్‌లో ఎన్‌సీసీ క్యాడెట్ల నుంచి ఆమె గౌరవ వందనం స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ సైనిక కుటుంబాలకు అండగా ఉండేందుకు ప్రజలు, వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు విరివిగా విరాళాలు అందజేయాలని కోరారు. విరాళాలకు ఆదాయపు పన్ను చట్టం కింద పన్ను మినహాయింపు లభిస్తుందన్నారు. కలెక్టర్ విరాళం అందజేశారు. జిల్లా సైనిక సంక్షేమాధికారి గుణశీల పాల్గొన్నారు.
సత్తెనపల్లి: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో పని చేసే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని పీఏసీఎస్ ఎంప్లాయిస్ యూనియన్ పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఆరాధ్యుల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు శనివారం నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు అయ్యారు. సత్తెనపల్లి మండలం పణిదంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ పీఏసీఎస్‌ల ద్వారా కాకుండా, డీసీసీబీల ద్వారా రైతులకు నేరుగా రుణాలు ఇవ్వకూడదన్నారు. ఖాళీల భర్తీ, వేతనానికి సంబంధించిన సమస్యలు, పర్మినెంట్ చేయడం వంటి అంశాలపై చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముందుగా పణిదం పీఏసీఎస్ చైర్మన్ యర్రగుంట్ల వెంకటేశ్వరరావుకు వినతి పత్రం అందించారు. ఉద్యోగులు తిరుమల, మల్లేశ్వరరావు తదితరులు ఉన్నారు.


