హోంగార్డుల సంక్షేమానికి కృషి
నరసరావుపేట రూరల్: హోంగార్డుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు తెలిపారు. 63వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం శనివారం పోలీసు పెరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ హాజరయ్యారు. కవాతు ప్రదర్శనను వీక్షించి, గౌరవ వందనం స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతలు కాపాడటంలో హోంగార్డులు ఎనలేని కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగ పరమైన సమస్యలు ఉంటే నేరుగా కలవాలని తెలిపారు. జిల్లాలో హోంగార్డ్స్ బెనిఫిట్ ఫండ్ ఏర్పాటుచేసి తక్షణ సహాయం అందిస్తున్నట్టు వివరించారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపిన ఏడుగురు హోంగార్డులకు ఎస్పీ ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) జేవీ సంతోష్, అడిషనల్ ఎస్పీ(ఏఆర్) వి.సత్తిరాజు, అడిషనల్ ఎస్పీ (క్రైం) లక్ష్మీపతి, నరసరావుపేట ఇన్‌చార్జి డీఎస్పీ ఎం.హనుమంతురావు, ఏఆర్ డీఎస్పీ గాంధీరెడ్డి, హోంగార్డు ఆర్‌ఐ ఎస్. కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


