భూ దాహానికి నిండు ప్రాణం బలి
మనస్తాపంతో పేద రైతుకు గుండెపోటు మృతదేహంతో తహసీల్దార్ కార్యాలయం ముందు బంధువుల ఆందోళన
కారెంపూడి: ఎంతో కాలంగా సాగు చేసుకుంటున్న భూమి తనది కాదనే చిచ్చు పెట్టడంతో మనస్తాపానికి గురై గుండెపోటుతో పేద రైతు బత్తుల ముసలయ్య (45)మృతి చెందిన ఘటన కారెంపూడిలో చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహం చెందిన బంధువులు శనివారం ఉదయం మృతదేహంతో భారీగా తహసీల్దార్ కార్యాలయానికి తరలివచ్చారు. ప్రధాన గేటు ముందుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ, ఆందోళనకు దిగారు. ఆ సమయంలో కార్యాలయంలో ఎవరూ లేరు. చాలాసేపటి తర్వాత ముసలయ్య సామాజిక వర్గానికి చెందిన నాయకులు జోక్యం చేసుకున్నారు. భూమి జోలికి ఎవరూ రాకుండా చూస్తామని అధికారులు, ప్రజా ప్రతినిధులు హామీ ఇచ్చారని వారికి నచ్చజెప్పి ఆందోళనను విరమింపచేశారు. తర్వాత మృతదేహాన్ని ఇంటికి చేర్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఆందోళన చేస్తున్న సమయంలో వివాదంలో తలదూర్చిన రెవెన్యూ అధికారులు తమను రూ.3 లక్షలు డిమాండ్ చేసి తీవ్ర మనోవేదనకు గురి చేశారని ఆరోపించారు. దీనిపై కుటుంబ సభ్యులు చెప్పిన వివరాలు ఇలా.. చాలా కాలంగా ముసలయ్య కుటుంబం పల్నాడు జిల్లా వినుకొండ రోడ్డులో ఎర్రగుంట సమీపంలో 1.02 ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2005లో ఆ భూమికి పట్టా కూడా ఇచ్చారు. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఆ భూమి తమదని అధికారుల అండతో ముసలయ్య గుండెల్లో మంట పెట్టారని బంధువులు ఆరోపిస్తున్నారు. అధికారులు కూడా ఆ వ్యక్తి మాట విని పదే పదే కార్యాలయానికి రావాలని కబురు చేస్తుండడంతో ముసలయ్య మనోవేదనకు గురయ్యాడు. రూ.3 లక్షలలిస్తే సమస్య లేకుండా చూస్తామని వేధించారని భార్య బంధువులు ఆరోపించారు. ఈ మనో వేదనతోనే ముసలయ్య ఆకస్మికంగా మృతి చెందాడని, ఇప్పుడు తమకు న్యాయం ఎవరు చేస్తారని.. పోయిన ప్రాణం తిరిగి తీసుకురాగలరా? అంటూ వారు విలపించారు. ముసలయ్యకు భార్య అంజమ్మ దత్తత తీసుకుని పెంచుకున్న కుమార్తె ఉన్నారు.
భూ దాహానికి నిండు ప్రాణం బలి


