పేదల భూముల నుంచి
వెలుగులోకి మరిన్ని అక్రమాలు రూ.10వేలు ఇచ్చి పాస్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్న పచ్చ నేతలు అసైన్డ్ అక్రమాలకు ప్రజాప్రతినిధి వత్తాసు భూములను పరిశీలించిన ప్రజాసంఘాల నాయకులు
నరసరావుపేట రూరల్: పమిడిమర్రులోని పేదల భూముల నుంచి యంత్రాలను సోమవారం తరలించారు. పేదలకు చెందిన అసైన్డ్ భూముల ఆక్రమణపై ‘ అసైన్డ్ భూముల్లో పచ్చ గద్దలు’ శీర్షికన సోమవారం ‘సాక్షి’ దినపత్రికలో కథనం ప్రచురితం అయిన విషయం విదితమే. ఈ కథనం స్థానికంగా సంచలనం సృష్టించింది. ప్రజా సంఘాల నాయకులు భూములను పరిశీలించారు. దీంతో స్పందించిన ఆక్రమణదారులు హడావిడిగా యంత్రాలను అక్కడి నుంచి తరలించారు.
పచ్చనేతల వద్ద పాస్‌బుక్‌లు
దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో మండలంలోని పమిడిమర్రులో 82 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూమిని పేదలకు కేటాయించారు. ఈ భూమిపై కన్నెసిన పచ్చనేతలు నరసరావుపేటకు చెందిన దళిత నాయకుడి సహకారంతో వ్యూహం రచించారు. పేదలకు డబ్బులు ఆశ చూపిన దళిత నాయకుడు వారి నుంచి ప్రభుత్వ పాస్‌బుక్‌లు తీసుకున్నట్టు సమాచారం. ఈ ప్రాంతలో ఎకరా భూమి రూ.10లక్షలకు పైగా ఉంటే కేవలం రూ.2లక్షలకే కొనుగోలు చేసేలా రైతుల నుంచి అగ్రిమెంట్ చేసుకున్నారు. మొదట విడతగా కేవలం రూ.10వేలు చెల్లించి రైతులు నుంచి భూములు స్వాధీనం చేసుకుని చదును చేసే పనిని ప్రారంభించారు.
ఆక్రమణలకు ప్రజాప్రతినిధి వత్తాసు
అసైన్డ్ భూములు చేతులు మారుతున్నాయనే సమాచారంతో రెవెన్యూ శాఖకు చెందిన అధికారులు పది రోజుల కిందట పమిడిమర్రు గ్రామంలో పర్యటించారు. అసైన్డ్ భూములను పరిశీలించి అక్కడ జరుగుతున్న భూమిని చదును చేసే పనులను నిలిపివేయించారు. దీనిపై పట్టణానికి చెందిన టీడీపీ ముఖ్యనేత ప్రజాప్రతినిధిని ఆశ్రయించినట్టు తెలిసింది. ప్రజాప్రతినిధి రెవెన్యూ అధికారిని పిలిచి అసైన్డ్ భూముల వ్యవహారంలో ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించినట్టు సమాచారం. ప్రజాప్రతినిధి మద్దతుతోనే పచ్చనేతలు నేరుగా రంగంలోకి దిగి చెరువులను ధ్వంసం చేయడంతోపాటు భూములు ఇవ్వని రైతులపై బెదిరింపులకు పాల్పడుతున్నారనే ప్రచారం ఉంది.
పేదల భూముల నుంచి
పేదల భూముల నుంచి


