చలిలో వెచ్చని నేస్తం
వాతావరణం మార్పులతో పెరిగిన చలి గజ గజ వణుకుతున్న జనం జిల్లాలో జోరుగా స్వెట్టర్ల వ్యాపారం
నాణ్యమైన దుస్తులు విక్రయిస్తున్నాం
సత్తెనపల్లి: నవంబర్ నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. సాధారణం కంటే రెండు డిగ్రీలు తక్కువ నమోదవుతున్నాయి. దీనికితోడు వాయుగుండం కారణంగా వాతావరణంలో మార్పుతో చల్లని గాలులు వీస్తూ చలి చంపేస్తోంది. వేకువ జాము నుంచే మంచు కప్పేస్తోంది. ఉదయం 9 గంటల వరకు చలి వణికిస్తుండడంతో కొందరు మంటలు వేసుకుని చలి కాచుకుంటుంటే .. మరికొందరు చలికి బయటకు రాలేకపోతున్నా రు. దీంతో జిల్లాలోని నరసరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, మాచర్ల, చిలకలూరిపేట, పెదకూర పాడు, గురజాల నియోజకవర్గాల్లో ఉన్ని దుస్తుల కు గిరాకీ పెరిగింది. రకరకాల డిజైన్లతో స్వెటర్లు, రెయిన్‌కోట్లు, శాలువాలు, మంకీ క్యాప్‌లు, మఫ్లర్లు, గ్లౌజులు, బెడ్ షీట్లు అందుబాటులో ఉంచి విక్రయిస్తుండడంతో కొనుగోలుదారులతో దుకాణాలు కిక్కిరిస్తున్నాయి.
జోరుగా ఉన్ని దుస్తుల విక్రయం...
జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాలు, పట్టణాల పరిధిలో రోడ్ల వెంబడి రంగురంగుల ఉన్ని దుస్తులు విక్రయిస్తున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వర కు ధరించే వివిధ డిజైన్లలో ఈ విక్రయాలు జోరందుకున్నాయి. చిన్నచిన్న వ్యాపారులు వ్యాపారం చేసుకుంటూ కుటుంబాలు పోషించుకుంటున్నా యి. తమకు తెలిసిన స్వెటర్లు, తదితర వాటిని తెచ్చి ప్రజలందరికీ పరిచయం చేసి తమపై నమ్మకాన్ని పెంచుకుంటున్నామని వ్యాపారులు అంటున్నారు. స్థానికులతోపాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, కోయంబత్తూర్ తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు ఇక్కడికి వచ్చి దుకాణాలు ఏర్పాటు చేసుకొని అన్ని రకాల ఉన్ని దుస్తులు, టూ ఇన్ వన్ రెయిన్ కోట్లు, బెడ్ షీట్లు(రగ్గులు) విక్రయిస్తున్నారు. ప్రధాన రహదారులు పక్కనే వీటిని అందుబాటులో ఉంచి విక్రయిస్తూ ఆ ప్రాంతాల్లోనే ఇల్లు అద్దెకు తీసుకొని వ్యాపారాలు చేస్తున్నారు. మున్సిపాలిటీలకు ఏటా ఆక్రమణల పన్ను చెల్లిస్తూ ప్రతి సంవత్సరం నవంబర్ నెల నుంచి ఫిబ్రవరి వరకు ఈ వ్యాపారాలు చేస్తున్నారు.
నాణ్యమైన ఉన్ని దుస్తులను సుదూర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి విక్రయిస్తున్నాం. ధరలు కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంటున్నాయి. ఏటా నవంబర్ మొదటి వారం నుంచి ఫిబ్రవరి వరకు ఈ వ్యాపారం చేస్తాం. వినియోగదారులు మంచి ఆదరణ చూపిస్తున్నారు. 2013 నుంచి ఈ వ్యాపారం చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నాం.
– చేవూరి జయరావు, వ్యాపారి, సత్తెనపల్లి
చలిలో వెచ్చని నేస్తం


