కృష్ణా నదిని పరిశీలించిన అధికారులు
కృష్ణా నదిలో నమూనాలు సేకరించిన పర్యావరణ శాఖ అధికారులు తంగెడ ప్రజలకు సురక్షిత నీరు అందించేలా చర్యలు
దాచేపల్లి: దాచేపల్లి మండలం తంగెడ గ్రామ సమీపంలోని కృష్ణానదిని పలు శాఖల అధికారులు సోమవారం పరిశీలన చేశారు. కృష్ణా నదిలో గుర్తు తెలియని వ్యక్తులు రసాయనాలు కలపడంతో నీరు కలుషితమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై సాక్షి దినపత్రిక సోమవారం ‘కృష్ణాలోకి కెమికిల్’ అనే శీర్షికన కథనాన్ని ప్రచురించింది. దీంతో రెవెన్యూ, పంచాయతీరాజ్, గ్రామీణ నీటిపారుదల శాఖ, పర్యావరణ శాఖ అధికారులు అప్రమతమయ్యారు. కృష్ణా నదిలో కెమికల్స్ కలిపిన ప్రాంతాన్ని సంబంధిత అధికారులు పరిశీలన చేసి వివరాలు సేకరించారు. కృష్ణానదిలో నీటిపై రసాయనాల తెట్టు ఇంకా పేరుకు పోయి ఉండడాన్ని గమనించారు. గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులు, పర్యావరణ శాఖ అధికారులు కెమికల్స్ కల్పిన ప్రాంతంలో మూడు చోట్ల శాంపిల్స్ సేకరించారు. సేకరించిన శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపి పరీక్ష చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. మండల తహసీల్దార్ జి.శ్రీనివాస్‌యాదవ్, పంచాయతీ కార్యదర్శి జి.కోటేశ్వరరావు, వీఆర్‌ఓ బి. యలమంద, గ్రామీణ నీటిపారుదల శాఖ ఏఈ అంగడి సోమయ్య, కృష్ణా నదిలో కెమికల్స్ కలిపిన ప్రాంతాన్ని పరిశీలన చేసి ప్రాథమిక ఆధారాలపై కూపిలాగారు. కృష్ణానది నుంచి తంగెడకు తరలించే నీటిని నిలిపివేశారు. తంగెడలోనే అందుబాటులో ఉన్న బోర్ల ద్వారా తాగునీరు అందించేలా చర్యలు చేపట్టారు. గ్రామం మొత్తం బ్లీచింగ్ చల్లించి పారిశుద్ధ్య పనులు చేపట్టారు. కృష్ణానది వద్ద రసాయనాలు కల్పిన ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లించారు. కృష్ణా నదిలో రసాయనాలు కలపటంపై విచారణ చేస్తున్నామని, రసాయనాలను ఎక్కడి నుంచి తీసుకువచ్చారు, ఎక్కడెక్కడ కలిపారనే అంశాలపై ఆరా తీస్తున్నట్లు తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌కి నివేదిక అందించనున్నట్లు ఆయన వెల్లడించారు.
కృష్ణా నదిని పరిశీలించిన అధికారులు
కృష్ణా నదిని పరిశీలించిన అధికారులు


