
పర్యవేక్షణ లేక ప‘రేషాన్’
అమరావతి: రేషన్ షాపులపై పర్యవేక్షణతో పాటు సరుకులను సక్రమంగా అందించడం కోసం పనిచేసే ఆహార సలహా సంఘాల నియామకంపై అనిశ్చితి నెలకొంది. అజమాయిషీ లేకపోవడంతో అధికారులు, డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కార్డుదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. సరుకుల పంపిణీలో లోపాలతో పాటు ఆహార నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది.
పట్టించుకోని అధికారులు
గతంలో ప్రతి మూడు నెలలకోసారి మండల స్థాయిలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆహార సలహా కమిటీ సభ్యులు సమావేశమయ్యేవారు. రేషన్ షాపుల నిర్వహణపై సమీక్షించేవారు. ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేకుండాపోయింది. నాణ్యత, తూకాలు పర్యవేక్షించాల్సిన అధికారులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎండీయూ ఆపరేటర్ల ద్వారా వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి రేషన్ అందించేవారు. ప్రస్తుత ప్రభుత్వంలో షాపుల ద్వారానే పంపిణీ చేస్తుండటంతో ప్రజలు కొన్నిచోట్ల ఇబ్బందులు పడుతున్నారు.
ఇదు మండలాలలో రేషన్ కార్డులు ఇలా..
పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో గల 188 రేషన్ షాపుల పరిధిలో 89,106 కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా 2,53,304మంది లబ్ధిదారులకు 12,860 క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేస్తున్నారు.
ప్రభుత్వం నిర్లక్ష్యం
రేషన్ షాపులపై ప్రభుత్వం చిన్నచూపు చూడటంతో పాటు పేదలకు సరుకులు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తోంది. అరకొరగా చక్కెర అందిస్తున్నారే గానీ కందిపప్పు ఇవ్వడం లేదు. ఒక్క నెల కూడా పూర్తిస్థాయి కోటా ఇచ్చిన దాఖలాలు లేవు.
– భవిరిశెట్టి హనుమంతరావు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, అమరావతి మండలం
సంఘాలు ఏర్పాటు చేయాలి
మండల స్థాయిలో వెంటనే అన్ని రాజకీయ పార్టీలకు చెందిన సభ్యులతో ఆహార సలహా సంఘం ఏర్పాటు చేయాలి. సంఘ సభ్యులు రేషన్ షాపుల్లో జరిగే అవతవకలు, సమస్యలను ఎప్పటికప్పుడు చర్చించి పరిష్కార మార్గాలు సూచిస్తారు.
– భైరాపట్నం రామకృష్ణ,
సీపీఐ పల్నాడు జిల్లా కార్యవర్గ సభ్యుడు
ఆహార సలహా సంఘాల నియామకంపై అనిశ్చితి రేషన్ షాపులపై కొరవడిన అజమాయిషీ సరుకుల పంపిణీలో లోపాలు ప్రశ్నార్థకంగా ఆహార నాణ్యత నష్టపోతున్న కార్డుదారులు
ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వీర్యం
గతంలో ఆహార సలహా సంఘాలు ఏర్పాటు చేసి సమావేశాలు నిర్వహించేవారు. రేషన్ షాపుల్లో లోటుపాట్లపై ఎప్పటి కప్పుడు పర్యవేక్షించేవారు. ప్రస్తుత ప్రభుత్వం సంఘాలను ఏర్పాటు చేయకపోవడంతో అవినీతి చోటు చేసుకుంది. – సూరిబాబు,
సీపీఎం మండల కార్యదర్శి, అమరావతి
త్వరలో నియామకం
చౌక ధరల దుకాణాల పరిధిలో ఆహార సలహా సంఘాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. త్వరలోనే నియామకానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలను మా దష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటాం.
– డానియేల్, తహసీల్దార్, అమరావతి
బియ్యం పంపిణీ వివరాలు
మండలం షాపుల కార్డుల లబ్ధిదారులు క్వింటాళ్లు
సంఖ్య సంఖ్య
అమరావతి 45 22,175 61,563 4,018
పెదకూరపాడు 34 16,640 45,574 2,081
క్రోసూరు 43 19,809 57,048 2,715
అచ్చంపేట 50 20,695 59,632 2,730
బెల్లంకొండ 16 9,962 29,487 1,316