
మల్లయ్య కుటుంబాన్ని ఆదుకోవాలి
మృతదేహంతో ఫ్యాక్టరీ ముందు ధర్నా
సత్రశాల(రెంటచింతల): స్థానిక పరాశక్తి సిమెంట్ ఫ్యాక్టరీలో విధులు నిర్వహిస్తూ మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని మృతుని కుటుం సభ్యులు, బంధువులు, కార్మికులు పరాశక్తి సిమెంట్ ఫ్యాక్టరీ ప్రధాన ద్వారం వద్ద బుధవారం రాత్రి ధర్నా చేశారు. ఫ్యాక్టరీలో ఏడు సంవత్సరాలుగా పని చేస్తున్న ఉప్పుతోళ్ల మల్లయ్య (47) జూన్ 29న విధి నిర్వహణలో ఉండగా ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. వెంటనే పరాశక్తి ఫ్యాక్టరీ అంబులెన్స్‌లో తొలుత పిడుగురాళ్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. వైద్య ఖర్చుల నిమిత్తం ఫ్యాక్టరీ యాజమాన్యం రూ. 50 వేలు అందజేసింది. అది కాకుండా మల్లయ్య కుటుంబ సభ్యులు మరో రూ. 2 లక్షల వరకు ఖర్చు చేశారు. ఆర్థికస్తోమత లేకపోవడం వల్ల అక్కడ నుంచి గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం మృతి చెందాడు. ఫ్యాక్టరీ అధికారులు మెరుగైన వైద్యం అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల మల్లయ్య మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలంటూ మృతదేహంతో ఫ్యాక్టరీ ప్రధాన రహదారి ముందు ధర్నా చేశారు. కొంతసేపు వాహనాలను అడ్డుకున్నారు. పోలీసులు ధర్నా వద్దకు చేరుకుని సర్ది చెప్పారు. మల్లయ్యకు భార్యతో పాటు నలుగురు సంతానం ఉన్నారు. తొలుత భార్య లక్ష్మమ్మ న్యాయం చేయాలని కోరుతూ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.