
మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలి
పిడుగురాళ్ల రూరల్: మిరప నారు పెంపకంలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఐ. వెంకట్రావు సూచించారు. కామేపల్లి రైతు భరోసా కేంద్రంలో బుధవారం సమగ్ర ఉద్యాన మిషన్ ఆధ్వర్యంలో మిరప నారు పెంపకంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఐ. వెంకట్రావు, డాట్ సెంటర్ అధికారి డాక్టర్ నగేష్ హాజరయ్యారు. ముందుగా కామేపల్లిలో నర్సరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకట్రావు నర్సరీ చట్టం– 2010 గురించి యజమానులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. స్టాక్, సేల్స్, తనిఖీ అధికారి రిజిస్టర్లతో పాటు రసీదులు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. నర్సరీ చట్టాన్ని అతిక్రమించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా డాట్ సెంటర్ అధికారి డాక్టర్ నగేష్ మిరప నారుమడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విత్తన శుద్ధి, సస్యరక్షణ , విత్తే సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా కో– ఆర్డినేటర్ మస్తాన్‌వలి, ఉద్యాన శాఖ అధికారి కుమారి అంజిలిబాయి, గ్రామీణ ఉద్యాన శాఖ అధికారులు కరిముల్లా, దస్తగిరి, పాల్గొన్నారు.
జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఐ. వెంకట్రావు