ప్రజలను నట్టేట ముంచుతున్నా పట్టని కూటమి పాలకులు | - | Sakshi
Sakshi News home page

ప్రజలను నట్టేట ముంచుతున్నా పట్టని కూటమి పాలకులు

Jul 10 2025 6:31 AM | Updated on Jul 10 2025 6:31 AM

ప్రజల

ప్రజలను నట్టేట ముంచుతున్నా పట్టని కూటమి పాలకులు

చెమట చుక్కలు చిందించి సాయిసాధన చిట్‌ ఫండ్‌లో పెట్టిన సొమ్మంతా పోగొట్టుకుని రోడ్డున పడి గుండెలు బాదుకున్న బాధితుల ఆర్తనాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. పిల్ల పెళ్లికి దాచుకున్న డబ్బు తీసుకుని బోర్డు తిప్పేస్తే.. ఆ తల్లిదండ్రుల గుండె మంటలు రగులుతూనే ఉన్నాయి. అయ్యా.. ఆత్మహత్యే శరణ్యమంటూ కనిపించిన ప్రతి ఒక్కరి కాళ్లు పట్టుకుని వేడుకున్న బాధితుల రోదనలు మిన్నంటుతూనే ఉన్నాయి. తమ కష్టం తిరిగొస్తుందో, రాదోననే దిగులుతో ఎదురు చూస్తున్న వారు కన్నీళ్లు కారుస్తూనే ఉన్నారు. అసలు నిబంధనలే పాటించకుండా అడ్డగోలుగా చిట్‌లు వసూలు చేసి, కుచ్చుటోపీ పెట్టిన బడాబాబులు మాత్రం దర్జాగా తిరుగుతున్నారు. నిబంధనలు పాటించని ఇంకా ఎన్నో సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నాయి. పాలకులు, అధికారులు మాత్రం స్పందించడం లేదు.

చిట్‌ఫండ్‌ సంస్థలు నడపాలంటే 1982 చిట్‌ ఫండ్స్‌ యాక్ట్‌ ప్రకారం రిజిస్ట్రేషన్‌ తప్పనిసరిగా చేయించాలి. చీటీ పాటలకు సంబంధించి సభ్యుల వివరాలు ఎప్పటికప్పుడు సమగ్ర వివరాలతో సంబంధిత అధికారులకు తెలియజేయాలి. ప్రతి నెలా నిర్వహణకు సంబంధించి లెక్కలు చూపాలి. సభ్యులకు లిఖితపూర్వక ఒప్పందాలు అందించాలి. ఎంత మొత్తంలో చీటీపాట నిర్వహిస్తున్నారో, అంత సొమ్మును జాయింట్‌ రిజిస్ట్రార్‌, చిట్‌ఫండ్‌ పేర్లతో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాలి. అయితే నేటి పరిస్థితుల్లో ఈ నియమాలు నామమాత్రంగా మారిపోయాయి. రిజిస్ట్రేషన్ల శాఖ అనుమతి లేకుండానే నిర్వాహకులు చీటీపాటలు నడుపుతున్నారు. ఇది చట్టప్రకారం నేరం అయినప్పటికీ సంబంధిత శాఖ అధికారులు ఇప్పటి వరకు ఒకరిపై కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇక నష్టపోయిన వారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగలేదు.

నరసరావుపేటటౌన్‌: రిజిస్ట్రేషన్‌ ఉన్న చిట్‌ ఫండ్‌లో సభ్యులుగా చేరితే డబ్బులకు ఢోకా లేదంటూ నమ్మించి కోట్లాది రూపాయలు పోగేసుకొని రాత్రికి రాత్రే సాయిసాధన చిట్‌ ఫండ్‌ సంస్థ బోర్డు తిప్పేసిన సంగతి తెలిసిందే. మోసపోయిన బాధితులు రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లితే పిడుగు లాంటి వార్త వినాల్సి వచ్చింది. సాయి సాధన చిట్‌ఫండ్‌కు అసలు రిజిస్ట్రేషన్ల శాఖ అనుమతులు లేవని తెలిసింది. యథేచ్ఛగా అక్రమ చీటీపాటల లావాదేవీలు కొనసాగించినట్లు తెలిసింది. దీంతో చిట్‌ఫండ్స్‌ విషయంలో అధికారుల డొల్లతనం తేటతెల్లమైంది. చట్టబద్ధమైన నిబంధనలు, రిజిస్ట్రేషన్ల శాఖ అనుమతులు లేకుండా నడుస్తున్న ఈ చీటీ పాటలకు అమాయక ప్రజలు పొదుపు ధనాన్ని పూర్తిగా నష్టపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యం, ప్రజల అవగాహన లోపం ఈ మోసాలకు దారి తీస్తున్నాయి. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో ఇటీవల అనధికార చిట్‌ఫండ్‌ సంస్థలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత శాఖ అధికారులు, అటు ప్రభుత్వం మౌనం వహించటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

అనధికారంగా

నడుస్తున్న పాటలు

చట్టపరంగా చిట్‌ఫండ్‌ సంస్థలు నడపాలంటే రిజిస్ట్రేషన్ల శాఖ అనుమతి తప్పనిసరి. కానీ ఇవి ఏమీ పాటించకుండా కొన్ని సంస్థలు అనధికార చీటీపాటలు నిర్వహిస్తున్నాయి. అందులో సభ్యులుగా చేరి చివరకు కట్టిన సొమ్ము చేతికి అందక బాధితులుగా మిగులుతున్నారు. పేరుకే సంస్థలు ఏర్పాటు చేస్తున్నారుగానీ, వాస్తవానికి ఎటువంటి బాధ్యత లేకుండా తెలివిగా వ్యవహరిస్తున్నారు. కొన్ని చిట్‌ఫండ్‌ నిర్వాహకులు ఒకటి, రెండు చీటీ పాటలకు అనుమతి పొందుతున్నారు. ఇక మిగిలినవి అనధికారికంగా నిర్వహిస్తున్నారు. ఏ ఆధారాలు లేకుండానే వేరే ప్రాంతాలకు తరలి పోయే సంస్థల యజమానుల వల్ల వందల సంఖ్యలో కుటుంబాలు డబ్బు నష్టపోతున్నాయి.

అమాయకులే బలిపశువులు

ఈ చీటీ పాటల మాయాజాలంలో పడే వారి తాలూకు బాధలు వర్ణనాతీతంగా మరాయి. అవసరానికి ఆదుకుంటాయని రూపాయి, రూపాయి కూడ బెట్టి స్థోమతను బట్టి నెలకు రూ.5,000 నుంచి రూ.50,000 వరకూ చెల్లిస్తూ వచ్చారు. చివరికి లబ్ధిదారులు డబ్బు పొందే సమయంలో నిర్వాహకులు షాక్‌ ఇస్తున్నారు. బోర్డు తిప్పేసి మాయం కావడం పరిపాటిగా మారింది. కట్టిన డబ్బులకు చట్టపరంగా ఏ విధమైన ఆధారాలూ లేకపోవటంతో సభ్యులు మోసపోతున్నారు. దీంతో పోలీసులు కూడా అనధికార చిట్‌లపై కేసులు నమోదుకు ముందుకు రావటం లేదు. ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో ఉంటున్నారు.

పాటించాల్సిన నిబంధనలు ఇవిగో..

నరసరావుపేటలో

చిట్‌ ఫండ్‌ మోసాలపై దృష్టి పెట్టాల్సిన రిజిస్ట్రేషన్‌, పోలీస్‌, రెవెన్యూ శాఖలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. అధికారులు తమ బాధ్యతలను నిర్వర్తించకపోవడమే ఈ తరహా మోసాలకు కారణం అవుతోంది. ప్రజలు ఫిర్యాదు చేసినా నామమాత్రంగానే చర్యలు తీసుకుంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు. కొన్ని సందర్భాల్లో తగిన ఆధారాలు లేని కారణంగా కేసును తిరస్కరిస్తున్నారు. ఫలితంగా మోసగాళ్లు నిర్భయంగా వ్యవహరిస్తున్నారు.

పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలో అనేక పేర్లతో చీటీ పాటలు నిర్వహిస్తున్నారు. గృహిణులు, చిన్న స్థాయి వ్యాపారులు, రోజువారీ కూలి చేసేకునే వారు, వంటి వారందరూ ఈ పాటల్లో సభ్యులుగా చేరుతున్నారు. కానీ ఇటీవల కొన్ని సంస్థలు వార్షిక మొత్తాన్ని తీసుకుని మధ్యలోనే ఆచూకీ లేకుండా మాయమవడం మొదలుపెట్టాయి. ఒకచోట గోడకెక్కిన బోర్డులు, ఖాళీగా ఉన్న కార్యాలయ గదులు, తాళం వేసిన తలుపులు కనిపిస్తే చిట్‌ఫండ్‌ సంస్థ బోర్డు తిప్పేసిందని అర్థం చేసుకోవచ్చు. అనధికార చిట్‌ఫండ్‌లపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించి బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే ప్రజలు మరింతగా తమ కష్టార్జితం నష్టపోయే అవకాశం ఉంది.

ప్రజలను నట్టేట ముంచుతున్నా పట్టని కూటమి పాలకులు1
1/1

ప్రజలను నట్టేట ముంచుతున్నా పట్టని కూటమి పాలకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement