
రోడ్డేది.. డిప్యూటీ సీఎం సారూ?
నరసరావుపేట రూరల్: రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటైన కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవస్థానానికి చేరే దారుల్లో ఒకటైన కొత్తపాలెం – కోటప్పకొండ రోడ్డు అధ్వానంగా తయారయింది. కోటప్పకొండ నుంచి గోనెపూడి మీదుగా కొత్తపాలెం వరకు ఈ రోడ్డు ఉంది. ఎనిమిది కిలోమీటర్ల ఈ మార్గంలో ప్రయాణించడం ద్వారా కోటప్పకొండ నుంచి చిలకలూరిపేట – నరసరావుపేట రోడ్డుకు చేరుకోవచ్చు. నాదెండ్ల మండలం నుంచి కోటప్పకొండ వైపునకు వచ్చే ప్రయాణికులు, యాత్రికులు ఈ రోడ్డును ఉపయోగిస్తుంటారు.
రూ.3.9 కోట్లు మంజూరంటూ ప్రకటన
గోతులమయంగా మారిన రహదారిలో వాహన దారుల ఇబ్బందులను ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు గత ఏడాది డిసెంబర్‌లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రముఖ పుణ్యక్షేత్రానికి చెందిన ప్రధాన రహదారి కావడంతో ఆయన స్పందించి రోడ్డు నిర్మాణానికి రూ.3.9 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ‘ఎక్స్’లో ప్రకటించారు. ఫిబ్రవరిలో జరిగే మహా శివరాత్రికి రోడ్డు నిర్మాణం పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు. ఈ మేరకు జనవరి నెలలో పాలనాపరమైన అనుమతులు ఇస్తూ ప్రభుత్వం నుంచి జీఓ కూడా విడుదల అయింది.
ఉన్నది తవ్వారు.. కొత్తది వేయరు..
రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రావడంతో టెండర్ల ప్రక్రియతో సంబంధం లేకుండానే టీడీపీ నేతలు పనులు ప్రారంభించారు. జనవరి నెలలో అప్పటివరకు ఉన్న రోడ్డును పొక్లెయిన్‌తో తవ్వేశారు. దీంతో కనీసం ద్విచక్ర వాహనాలు కూడా ఈ రోడ్డులో ప్రయాణించలేని పరిస్థితి ఏర్పడింది. దీనిపై తీవ్ర విమర్శలు రావడం, ఫిబ్రవరి 26వ తేదీన నిర్వహించిన కోటప్పకొండ తిరునాళ్లకు సమయం దగ్గర పడటంతో టెండర్లు లేకుండానే హడావుడిగా రోడ్డు పనులు ప్రారంభించారు. వెట్‌మిక్స్ పరిచి దుమ్ము లేవకుండా నీళ్లు చల్లి తిరునాళ్ల వరకు ముగించారు.
కోటప్పకొండ – కొత్తపాలెం రోడ్డు నిర్మాణం మాటల్లోనే..
నిధులు మంజూరు చేస్తున్నట్టు గతంలో ప్రకటించిన డిప్యూటీ సీఎం 8 కి.మీ. రోడ్డుకు రూ.3.9 కోట్లు మంజూరు చేస్తూ జీఓ సైతం జారీ ఎనిమిది నెలలు గడిచినా ప్రారంభం కాని పనులు
రెండు నెలల్లో పూర్తి చేస్తాం
ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా టెండర్ల ప్రక్రియలో కొంత ఆలస్యం జరిగింది. దీంతో వెట్‌మిక్స్ పనులకు సంబంధించి క్వాలిటీ కంట్రోల్ పరీక్షలు కూడా నిర్వహించాం. ఇప్పటికి 25శాతం వరకు పనులు పూర్తి అయ్యాయి. పనులు వెంటనే ప్రారంభించి రెండు నెలల్లో అందుబాటులోకి తీసుకు వస్తాం.
– ప్రసన్నకుమార్, పంచాయతీరాజ్ జేఈ