
రేపు వెలగపూడిలో ప్రపంచ జనాభా దినోత్సవం
ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ
తాడికొండ: ఈనెల 11న తుళ్లూరు మండలం వెలగపూడి సచివాలయం సమీపంలో ప్రపంచ జనాభా దినోత్సవం జరగనుంది. కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్న నేపఽథ్యంలో అందుకు సంబంధించి ఏర్పాట్లను బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, ఎస్పీ సతీష్ కుమార్, సంయుక్త కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ కలిసి పరిశీలించారు. ముఖ్యమంత్రి కార్యక్రమానికి సంబంధించి సభా స్థలి ఏర్పాట్లు, బార్ కోడింగ్, వాహనాల పార్కింగ్, సీటింగ్, తాగునీరు, పారిశుద్ధ్య పనులు తదితర నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ చర్చించారు. పలు సూచనలు జారీ చేశారు. గుంటూరు ఆర్డీఓ శ్రీనివాసరావు, సీపీఓ శేషశ్రీ, డీపీఓ నాగసాయి కుమార్, పీడీ డ్వామా శంకర్, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ అమర్తలూరి శ్రావణ్ బాబు, తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ, ఎంపీడీఓ శిల్ప, తుళ్లూరు తహసీల్దార్ సుజాత,అధికారులు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో వేదవ్యాస ఆరాధన
అమరావతి: ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన వైకుంఠపురం భవఘ్ని ఆరామంలోని వేదవ్యాసాలయంలో గురిపూర్ణిమ మహోత్సవాలలో రెండవరోజు కార్యక్రమాలలో భాగంగా బుధవారం వ్యాస భగవానునికి సుప్రభాతసేవ, పంచామృత అభిషేకం, వ్యాస ఆరాధన కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భవఘ్ని గురూజీ భక్తులనుద్దేశించి మాట్లాడుతూ సమాజంలో ఆధునికత, నాగరికత పేరుతో మానవాళి చెడు మార్గం పట్టకుండా సన్మార్గంలో నడిపించడానికి వ్యాస భగవానుడు అందించిన భగవద్గీత మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. వేడుకలలో ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన, షూక్ బాపూజీ పద్యనాటకం భక్తులను ఎంతగానో అలరించాయి. భక్తులు పలు జిల్లాల నుంచి భారీగా పాల్గొన్నారు.
జలవిద్యుత్ కేంద్రాన్ని
సందర్శించిన సీఈ
విజయపురి సౌత్: నాగార్జునసాగర్ కుడి కాలువ జలవిద్యుత్ కేంద్రాన్ని శ్రీశైలం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ చీఫ్ ఇంజినీర్ జి.తిరుమల ప్రసాద్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. శ్రీశైలం క్రస్ట్ గేట్లు ఎత్తి నాగార్జునసాగర్‌కు నీటి విడుదల జరుగుతుండటంతో కుడి జలవిద్యుత్ కేంద్రంలో పవర్ జనరేషన్‌కు సిద్ధంగా ఉండాలని సూచించారు. సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జెన్‌కో క్వార్టర్స్‌ను పరిశీలించారు. సీఈ తిరుమల ప్రసాద్‌ను జెన్‌కో అధికారులు ఘనంగా సత్కరించారు. కుడి జలవిద్యుత్ కేంద్రం ఈఈ సీహెచ్ అప్పాజీ, సివిల్ ఎస్‌ఈ కె.వెంకటరమణ, సివిల్ ఈఈ సుబ్రహ్మణ్యం, 327 యూనియన్ సెక్రటరీ బి.సూరజ్‌చంద్, అధ్యక్షుడు ఎం.సాంబశివ, ఎన్.రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
అమరేశ్వరుని ఆదాయం రూ.27.09 లక్షలు
అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అమరావతిలో వేంచేసియున్న శ్రీబాలచాముండికా సమేత శ్రీ అమరేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం హుండీ కానుకల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. గత నాలుగు నెలలుగా హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని లెక్కించారు. కోటప్పకొండ దేవస్థానం సహాయ కమిషనర్ చంద్రశేఖరరావు పర్యవేక్షణలో దేవాలయంలోని 10 హుండీలను తెరచి అందులో ఉన్న నగదును లెక్కించారు. ఈఓ రేఖ మాట్లాడుతూ హుండీల ద్వారా రూ.26,32,499, అన్నదానం హుండీల ద్వారా రూ.75,596, మొత్తం రూ.27,09,095 వచ్చిందన్నారు.

రేపు వెలగపూడిలో ప్రపంచ జనాభా దినోత్సవం

రేపు వెలగపూడిలో ప్రపంచ జనాభా దినోత్సవం

రేపు వెలగపూడిలో ప్రపంచ జనాభా దినోత్సవం