
ప్రజల కోసం వైఎస్ జగన్ పోరాటం ఆగదు
సత్తెనపల్లి: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో పర్యటనకు వచ్చిన సందర్భంగా 113 మందికి నోటీసులు ఇచ్చామని పోలీసులు అంటున్నారని, పది లక్షల మందికి ఇచ్చినా ప్రజల పక్షాన వైఎస్ జగన్ పోరాటం చేస్తారని, అది ఆగేది కాదని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అన్నారు. విచారణలో భాగంగా వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడుతో కలిసి బుధవారం సత్తెనపల్లి పోలీసుస్టేషన్‌కు ఆయన వచ్చారు. పోలీసుల విచారణ అనంతరం పోలీసుస్టేషన్ ఎదుట మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నందున చేతనైతే ప్రజలకు మంచి చేయాలన్నారు. ప్రజలు, ప్రతిపక్షాల వారు రోడ్డు మీదకు రాకూడదంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సూచించారు. ప్రజలకు న్యాయం చేయకుండా తిరుగుబాటు వస్తే ప్రతిపక్షాల గొంతు నొక్కాలని భావిస్తున్నారని పేర్కొన్నారు. ఆ తిరుగుబాటే విప్లవం అవుతుందని, ఆ విప్లవం నాలుగు సంవత్సరాల్లో టీడీపీని కాల్చి పడేయబోతుందన్నారు.
హామీలపై నిలదీస్తున్నందుకే భయం
వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. వాస్తవంగా వైఎస్ జగన్‌ను చూస్తే చంద్రబాబుకు భయమన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు సీఎం భయపడుతున్నట్లు పేర్కొన్నారు. అందుకే ఇలాంటి కేసులు బనాయిస్తున్నారని తెలిపారు. చిత్తూరు వెళితే మామిడి రైతులు కాయలను రోడ్డు మీద పడేస్తున్నారని గుర్తుచేశారు. పల్నాడుకు వస్తే ధాన్యం, పొగాకు, అపరాలు కొనేవారు లేరన్నారు. గొడవలు సృష్టించడం, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతలపై అక్రమ కేసులు పెట్టడం తప్ప ఇంకేమీ చేయడం లేదన్నారు. తమను ఇక్కడకు ఏం చేశామని పిలిపించారని ప్రశ్నించారు. జిల్లా లీగల్ సెల్ అధ్యక్షురాలు రోళ్ల మాధవి, వైఎస్సార్‌సీపీ నాయకులు చల్లంచర్ల సాంబ శివరావు, భావనాశి యల్లారావు, అచ్యుత శివప్రసాద్, ముక్త్యార్, గుజ్జర్లపూడి చంటి, గుజ్జర్లపూడి కృపారావు, వాకుమళ్ల చెంచిరెడ్డి, తుమ్మల వెంకటేశ్వరరావు, సయ్యద్ ఘోరా, వల్లెం నరసింహారావు, గడ్డం వెంకటేశ్వర్లు (బుల్లోడు), గంటా ఏసుబాబు, యాసారపు బాబు తదితరులు పాల్గొన్నారు.
పది లక్షల మందికి నోటీసులిచ్చినా
ముందుకే సాగుతాం
మాజీ ఎమ్మెల్యేలు కాసు మహేష్‌రెడ్డి,
బొల్లా బ్రహ్మనాయుడు వెల్లడి
సత్తెనపల్లి పోలీసు స్టేషన్‌లో
విచారణకు హాజరు