
వృథా.. అన్నదాతల వ్యథ
దుర్గి: కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదైనా నియోజకవర్గంలో మైనర్ రిజర్వాయరైన బుగ్గవాగు డ్యాం మరమ్మతులకు నోచుకోలేదు. పల్నాడు జిల్లా, ముఖ్యంగా మాచర్ల, గురజాల నియోజకవర్గ ప్రజల వరధాయిని లాంటి బుగ్గవాగు డ్యాం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రస్తుతం వాడుకలో ఉన్న రిజర్వాయర్‌ను సక్రమంగా రైతులకు అందుబాటులోకి తీసుకురాలేకపోవటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఉంది. సాగర్ కుడికాలువ నుంచి బుగ్గ వాగు డ్యాంకు నీటిని సరఫరా చేసి ఇక్కడ నుంచి కుడికాలువకు నీటిని సరఫరా చేస్తూ లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేయటమే ఈ రిజర్వాయర్ ప్రధాన ఉద్దేశ్యం. మాచర్ల, గురజాల నియోజక వర్గాలతో పాటు ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాలకు ఈ రిజర్వాయర్ నుంచి నీరు సరఫరా అవుతుంది.
అల్లాడుతున్న రైతాంగం
ఖరీఫ్ సీజన్‌లో ముందస్తు వర్షాలు వస్తున్నాయని వాతావరణ శాఖ ప్రకటించటంతో రైతాంగం మే మొదటివారం నుంచి ముందస్తుగా వేలాది ఎకరాల్లో పత్తిని సాగు చేశారు. అయితే వర్షాలు సరిగా పడక, డ్యాంలో నీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. ఈ విషయమై రైతులు అధికారులు, ప్రజా ప్రతినిధులకు విన్నవించుకున్నా వారి గోడు ఆలకించేవారే కరువయ్యారు. ప్రస్తుత సీజన్‌కు నీటి సరఫరా రానున్న తరుణంలో హడావుడిగా రెండు షట్టర్లకు తాత్కాలికంగా మరమ్మతులు నిర్వహిస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో డ్యాంను ఆపరేట్ చేసి షట్టర్లను బాగు చేస్తేనే రైతులకు, ప్రజలకు మేలు జరుగుతుంది.
తాగునీటికి అల్లాడిపోతున్నాం
ఊరి బోర్లలో నీరు లేకపోవటంతో బుగ్గవాగు డ్యాం నుంచి పైపుల ద్వారా మా గ్రామానికి తాగునీటి సరఫరా అవుతుంది. డ్యాంలో కనీస నీటిమట్టం లేకపోవటంతో తాగునీరు రావటం లేదు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకొని నీటిని నిల్వ చేసి తాగునీటి సమస్య పరిష్కరించాలి. – ఎం.సాంబయ్య, కంచరగుంట
బోర్లు ఎండిపోయాయి
డ్యాంలో కనీస నీటిమట్టం ఉన్నట్లయితే మా గ్రామంతో పాటు పరిసర గ్రామా ల్లో వేలాది బోర్లలో సమృద్ధిగా నీరు వచ్చి పంటలు సాగు చేసుకునేవారం. డ్యాంలో నీరు నిల్వ లేకపోవటంతో మొత్తం బోర్లు పూర్తిగా ఎండిపోయాయి. దీని మూలంగా వేలాది ఎకరాల్లో పత్తిపంట ఎండిపోయింది.
– తోటకూర వెంకటేశ్వర్లు, రైతు
రెండు గేట్లకు
అనుమతులు వచ్చాయి
బుగ్గ డ్యాం ఆరు గేట్లలో రెండు గేట్లు ధ్వంసమైన నేపథ్యంలో వీటి మరమ్మతుల కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపాం. రెండు గేట్లకు నిధులు కేటాయించింది. గత పదిహేను రోజులుగా మరమ్మతులు నిర్వహిస్తున్నాం. మరో 15 రోజుల్లో మరమ్మతులు పూర్తి చేసి నీరు వృథాకాకుండా చర్యలు తీసుకుంటాం. మిగిలిన వాటిని త్వరలోనే మరమ్మతులు చేయిస్తాం.
– శివయ్య, జేఈ, ఎన్‌ఎస్‌పీ డ్యాం
బుగ్గవాగు డ్యాం మరమ్మతులతో వృథాగా సాగర్ జలాలు ఆరు గేట్లలో నాలుగు ధ్వంసం నీటి నిల్వ లేక అడుగంటుతున్న భూగర్భ జలాలు ఎండిపోతున్న బోర్లు, పంటలు .. రైతుల గగ్గోలు సాగు, తాగు నీటికి తీవ్ర కటకట
పాడైన నాలుగు గేట్లు
బుగ్గవాగు డ్యాంకు సంబంధించి మొత్తం ఆరు గేట్లు పనిచేస్తుంటాయి. వీటిలో నాలుగు ధ్వంసం కావటంతో వాటిని ఆపరేటింగ్ చేయకపోవటంతో వచ్చిన నీరు వచ్చినట్లు కిందికి వెళ్లిపోతోంది. దీంతో కనీస నీటిని నిల్వ చేయలేకపోతున్నారు. రిజర్వాయర్ మొత్తం కెపాసిటీ 3463టీఎంసీలు, డెడ్ స్టోరేజీ కెపాసిటీ 1.698టీఎంసీలు. కానీ షట్టర్లు ధ్వంసం కావటంతో జలాశయంలో నీరు అడుగంటుతోంది. మొత్తంగా నీటి లెవల్ 475.58టీఎంసీలు అందుబాటులో ఉండటం లేదు.

వృథా.. అన్నదాతల వ్యథ

వృథా.. అన్నదాతల వ్యథ

వృథా.. అన్నదాతల వ్యథ