
అధికారులు సమన్వయంతో పనిచేయండి
జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు
నరసరావుపేట: పేద మహిళలకు అందించే పథకాలపై సమన్వయంతో అన్నిశాఖల అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు ఆదేశించారు. కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో శనివారం వివిధ శాఖల సమన్వయ సమావేశం నిర్వహించి ఏసీఎల్‌పీ యాన్యువల్ క్రెడిట్ లవ్లీహుడ్ ప్లాన్‌పై సమీక్ష చేశారు. ఇందులో భాగంగా డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఝాన్సీరాణి ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘం సభ్యులకు దీనిలో వచ్చిన అంశాలు ఆధారంగా వ్యవసాయ, హార్టికల్చర్, పశుసంవర్ధక, జిల్లా పరిశ్రమలు, ఫిషరీస్, పట్టు పరిశ్రమలు, ఖాదీబోర్డు, హ్యాండ్లూమ్ శాఖలు జిల్లాలోని డ్వాక్రా సంఘ మహిళలకు అవసరమైన పథకాలు వివరించడంలో ఎటువంటి మార్గదర్శకాలను పాటించాలనే విషయం తెలియచేశారు.
చుక్కల భూముల
సమస్యలను పరిష్కరించండి..
నరసరావుపేట: జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న 22 ఏ జాబితాలో పడిన చుక్కల భూములను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు ఆదేశించారు. కార్యాలయంలో శనివారం జేసీ సూరజ్ గనోరేతో కలిసి సమీక్షచేశారు. మూడు రెవెన్యూ డివిజన్లకు సంబంధించి 22ఏ లిస్టులోని భూములు ఎవరెవరికి చెందినది, వారికి ఎలా సంక్రమించిందనే వివరాలను భూముల రికార్డుల ఆధారంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయా భూములను సరైన ఆధారాలు చూపించిన వాటిని వెంటనే తీసుకొని అర్హత కలిగిన వారికి 22ఏ నుంచి తొలగించాలని ఆదేశాలు ఇచ్చారు. డీఆర్‌ఓ మురళి, ఆర్డీఓలు కె.మధులత, రమణారెడ్డి, మురళీకృష్ణ, కలెక్టర్ ఆఫీస్ రెవెన్యూ సూపరిండెంట్ నాగిరెడ్డి, తహసీల్దార్లు దానియేలు, జి.శ్రీనివాస్, కిరణ్, నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు.
10న మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్
నరసరావుపేట: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో జూలై 10న పండగ వాతావరణంలో మెగా పేరెంట్స్ టీచర్స్ (పీటీఎం 2.0) సమావేశం నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
గతంలో కేవలం ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే పరిమితమైన పీటీఎంలో ఈ విద్యాసంవత్సరంలో ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలను సైతం భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో 3.04లక్షల మంది తల్లిదండ్రులు భాగస్వామ్యం కానున్నారన్నారు. ఉదయం తొమ్మిది నుంచి ఒంటి గంట వరకు సమావేశం జరుగుతుందన్నారు. అదేవిధంగా అమ్మ పేరుతో ఒక మొక్కను ప్రతి విద్యార్థికి అందించడం జరుగుతుందని, ఆ మొక్కకు సంబంధించి వారికి గ్రీన్ పాస్‌పోర్టు అందజేస్తామన్నారు. అందులో ఆ మొక్క వివరాలు అదేవిధంగా మొక్క ఎదుగుదలను సంబంధించి ప్రతి మూడు, ఆరు నెలలకు ఒకసారి నమోదు చేసి గ్రీన్ పాయింట్లను యాడ్ చేయడం జరుగు తుందన్నారు.