
ఆడపిల్లల ఆస్తిహక్కు కోసం పోరాడిన సూర్యావతి
సత్తెనపల్లి: ఆడపిల్లలకు ఆస్తి హక్కు కోసం, మద్యపానం నిషేధం కోసం సూర్యావతి పోరాడారని ఐద్వా పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటుపల్లి రజిని అన్నారు. ఐద్వా నాయకురాలు స్వర్గీయ మానుకొండ సూర్యావతి వర్ధంతి కార్యక్రమం పట్టణంలో శుక్రవారం నిర్వహించారు. వర్ధంతి సభకు ఐద్వా పట్టణ అధ్యక్షురాలు మునగా జ్యోతి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు గద్దె ఉమశ్రీ మాట్లాడుతూ మండల అధ్యక్షురాలిగా, శాసనమండలి సభ్యురాలిగా సూర్యావతి పని చేశారన్నారు. ఇంటింటికి మరుగుదొడ్లు, సంపూర్ణ మద్యపాన నిషేధం, ఆడ పిల్లల ఆర్థిక స్వాతంత్య్రం కోసం సూర్యావతి పోరాడారని వివరించారు. మద్యం వలన మహిళలపై నిత్యం లైంగికదాడులు, దాడులు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వాలు చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రేషన్ దుకాణాల ద్వారా కేరళ తరహాలో 16 రకాల సరుకులు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. సూర్యావతి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఐద్వా జనరల్ బాడీ సమావేశం నిర్వహించి నూతన వార్డు కమిటీని ఎన్నుకున్నారు. ఐద్వా నాయకురాలు ధరణికోట విమల, సుధారాణి, లక్ష్మి, అనురాధ, అనంతలక్ష్మి మల్లేశ్వరి, జ్యోతి, భవాని, ఉమామహేశ్వరి భారతి , కౌలు రైతు సంఘం మండల కార్యదర్శి పెండాల మహేష్, తదితరులు పాల్గొన్నారు.
ఐద్వా పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటుపల్లి రజిని