
కష్టాల్లో పింగళి వెంకయ్య కుటుంబీకులు
దయనీయ స్థితిలో
ఆయన మనవరాలు భవాని
చీరాల: జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య మనవరాలు భవాని దయనీయస్థితిలో ఉంది. అనారోగ్యానికి గురై కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇంటి నిర్మాణం జరిగినా అది శిథిలావస్థకు చేరింది. పింగళి వెంకయ్య వర్థంతి కార్యక్రమాన్ని శుక్రవారం వేటపాలెం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో దేవాంగపురిలోని ఆయన మనవరాలు భవాని గృహంలో జరగ్గా ఈ విషయాలు వెలుగు చూశాయి. వర్ధంతి కార్యక్రమంలో రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షుడు బట్ట మోహనరావు మాట్లాడుతూ త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య స్వాతంత్య్ర సమరయోధునిగా ఎన్నో సేవలు చేశారన్నారు. కృష్ణాజిల్లా దివి తాలూకా పెద్ద కల్లేపల్లి గ్రామంలో 1878లో ఆయన జన్మించారన్నారు. ఉన్నత చదువులు చదివిన ఆయన చరిత్ర అధ్యాపకుడిగా పనిచేశారని వివరించారు. ఆయన మనవరాలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అనంతరం సీతారామయ్య, భవాని దంపతులను రోటరీ క్లబ్ తరఫున సన్మానించారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు ఏవీ సురేష్‌బాబు, కార్యదర్శి అక్కల చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, రామకృష్ణ పాల్గొన్నారు.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 522.50 అడుగుల వద్ద ఉంది. ఇది 153.8745 టీఎంసీలకు సమానం. సాగర్ నుంచి ఎడమ కాలువకు 2,114 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 54,542 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.

కష్టాల్లో పింగళి వెంకయ్య కుటుంబీకులు