
అక్కసుతో ధ్వంస రచన!
పిడుగురాళ్ల: జానపాడు రోడ్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డితోపాటు పలువురు ప్రజాప్రతినిధులు శంకుస్థాపన చేసిన జానపాడు రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనుల శంకుస్థాపన శిలాఫలకాన్ని గురువారం మున్సిపల్ సిబ్బంది ధ్వంసం చేశారు. అయితే ఆ శిలాఫలకం ఎదురుగా కూటమి ప్రభుత్వం నేతలు ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు ఇటీవల ప్రారంభించిన శిలాఫలకం జోలికి వెళ్లక పోవడం గమనార్హం.
వైఎస్సార్ సీపీ గుర్తులు చెరిపేయాలనే కుట్ర..
జానపాడు రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనుల కోసం రోడ్డు ఇరువైపులా ఉన్న ఆక్రమణలు తొలగించాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులది.. తొలగించిన తర్వాత నిర్మాణ పనులను ఆర్‌అండ్‌బీ అధికారులు చేపడతారు. ఈ క్రమంలోనే మున్సిపల్ అధికారులు ఆక్రమణలను తొలగిస్తూ వైఎస్సార్ సీపీ హయాంలో వేసిన శిలాఫలకాన్ని కూడా ధ్వంసం చేశారు. దీనిపై స్థానికులు, వైఎస్సార్ సీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శిలాఫలకం ధ్వంసం రాజకీయ కుట్రలో భాగమేనని, కూటమి నాయకులు కావాలనే ఈ కుట్ర చేశారని ఆరోపిస్తున్నారు. అభివృద్ధి పనుల కోసం ఏర్పాటు చేసిన శిలఫలకాలను ఇలా ధ్వంసం చేయటం సరికాదని, ఇది దుస్సంప్రదాయానికి దారితీస్తుందని వైఎస్సార్ సీపీ నాయకులు పేర్కొన్నారు.
వైఎస్సార్ సీపీ హయాంలో ఏర్పాటు చేసిన రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనుల శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన మున్సిపల్ సిబ్బంది టీడీపీ ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిన శిలాఫలకం జోలికి వెళ్లని వైనం రాజకీయ కుట్రలో భాగంగానే అంటున్న పరిశీలకులు
ఆక్రమణల తొలగింపులో భాగంగానే..
దీనిపై మున్సిపల్ కమిషనర్ ఐ.శ్రీనివాసులును వివరణ కోరగా జానపాడు బ్రిడ్జి నిర్మాణ పనులలో భాగంగా రోడ్డు ఆక్రమణలను తొలగిస్తున్నామని, అందులో భాగంగానే తమ సిబ్బందే శిలాఫలకాన్ని ధ్వంసం చేశారని చెప్పారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రారంభించిన శిలాఫలకాన్ని ఎందుకు వదిలేశారని ప్రశ్నించగా త్వరలో దాన్ని కూడా తొలగిస్తామని తెలిపారు.

అక్కసుతో ధ్వంస రచన!