కల్యాణమస్తు..!
భువనేశ్వర్: రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సర్కారు మరో ఆకర్షణీయమైన పథకాన్ని ప్రవేశ పెట్టింది. మహిళల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న సుభద్ర యోజన తర్వాత ముఖ్యమంత్రి కన్య వివాహ యోజన ప్రవేశపెట్టడం విశేషం. పెళ్లి సందర్భంగా యువతులకు ఈ పథకం కింద ఆర్థిక సాయం లభిస్తుంది. అయితే ఈ పథకం స్వల్ప కాలిక పథకంగా ప్రభుత్వం ప్రకటించింది. ఆర్థికంగా బలహీనమైన కుటుంబాల కూతురు పెళ్లిని సాంస్కృతిక రీతిలో సామాజిక గౌరవంతో జరిపించేందుకు చేయూతనివ్వడం ఈ పథకం లక్ష్యంగా పేర్కొన్నారు. నిర్ధిష్టమైన మార్గదర్శకాలతో అర్హులైన యువతులకు పెళ్లి సందర్భంగా ఈ పథకం కింద రూ.51,000ల ఆర్థిక సాయం అందజేస్తారు. కొనసాగుతున్న ఆర్థిక సంవత్సరం 2025 – 2026 నుంచి 2029 – 2030 వరకు అమలులో ఉంటుంది.
ఒక కుటుంబంలో ఒకరికే..
ఒక కుటుంబంలో ఒకే యువతి పెళ్లి కోసం ముఖ్యమంత్రి కన్య వివాహ యోజన ప్రయోజనం కల్పిస్తారు. ఈ పథకం లబ్ధి పొందాలంటే వధూవరులు ఇరువురూ ఒడిశా స్థిర నివాసితులై ఉండాలి. వధువు వయస్సు 18 నుంచి 35 ఏళ్లు, వరుడి వయస్సు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలని స్పష్టం చేశారు. సాధారణంగా తొలిసారి వివాహానికి ఈ సాయం అందజేస్తారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వితంతు పునర్వివాహానికి కూడా ఈ పథకం ఆదుకుంటుందని స్పష్టం చేయడం విశేషం.
ఇతర రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ పథకాల కింద వివాహ సాయం పొందినవారిని ఈ పథకం నుంచి మినహాయిస్తారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఈ పథకం వర్తిస్తుంది. జిల్లావారీగా పథకం ప్రయోజనం కల్పిస్తారు. జిల్లాలకు కేటాయించిన పరిమితిలో సాయం మంజూరు పరిశీలిస్తారు. జిల్లా బడ్జెట్ లభ్యత ప్రకారం సాయం అందజేస్తారు. అర్హత కలిగిన జంటలు ప్రత్యక్షంగా లిఖితపూర్వక అభ్యర్థనతో జిల్లా కార్యాలయంలో లేదా అధీకృత సంస్థల ఆధ్వర్యంలో దరఖాస్తు దాఖలు చేయాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలన ముగించి తుది ఆమోదం కోసం జిల్లా స్థాయికి సిఫారసు చేస్తారు. ఐఏఎస్ అధికారులు మరియు జిల్లా అధికారులు వివాహ వేడుకల్లో సాంస్కృతిక పద్ధతుల ఆచరణను పర్యవేక్షిస్తారు.
రిజిస్ట్రేషన్ తప్పనిసరి
పథకం ప్రయోజనం పొందేందుకు చట్టపరంగా వివాహం నమోదు (రిజిస్ట్రేషన్) తప్పనిసరి. ముఖ్యమంత్రి కన్య వివాహ యోజన సాయం 3 వర్గాల కింద మంజూరు చేస్తారు. సింహభాగం రూ.36,000లు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) కింద పొదుపు ఖాతాకు బదిలీ చేస్తారు. పెళ్లి కానుక (చీర, గాజులు, పట్టీలు, మట్టెలు) కింద రూ.10,000లు, మిగిలిన రూ.6,000 పెళ్లి వేదిక తదితర ఏర్పాట్లు కోసం విడుదల చేస్తారు. అల్ప ఆదాయం, నిలువ నీడ లేని వారికి ప్రాధాన్యత కల్పిస్తారు. పునర్వివాహం కోరుకునే వితంతువులు, దివ్యాంగులు, పీవీటీజీలు, షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ), షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ) వర్గాలకు సాయం మంజూరులో ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఈ వర్గాలకు చెందిన వారికి మొదట వచ్చిన వారికి తొలి అవకాశం ప్రామాణికంగా పరిగణించి పరిశీలిస్తారు.
పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ప్రభుత్వ సాయం
ముఖ్యమంత్రి కన్య వివాహ
యోజనతో మేలు
వధువుకు రూ.51,000ల
ప్రయోజనం


