కళలకు హృదయ స్పందన..!
రాయగడ: స్థానిక రామలింగేశ్వర మందిరం ప్రాంగణంలో స్పందన సాహితీ, సాంస్కృతిక సంస్థ 30వ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉదయం కవి సమ్మేళనంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయని ఆ సంస్థ అధ్యక్షుడు గుడ్ల గౌరీ శంకర్ ప్రసాద్ తెలిపారు. సాయంత్రం 5 గంటలకు జరిగే వార్షికోత్సవ సభలో ముఖ్య అతిథిగా కవి, రచయిత విశ్రాంత ప్రొఫెసర్ (విశాఖపట్నం) డాక్టర్ కేజీ వేణు, గౌరవ అతిథిగా రాయగడ మున్సిపాలిటీ చైర్మన్ మహేష్ పట్నాయక్‌లు పాల్గొంటారన్నారు. సాయంత్రం స్పందన నృత్య పాఠశాలకు చెందిన విద్యార్థులు, కళాకారులచే వివిధ సాంసృతిక కార్యక్రమాలు జరుగుతాయని, సాహితీవేత్తలు, సాహితీ ప్రియులు, కళాకారులు, పట్టణ ప్రముఖులు హాజరవ్వాలని కోరారు.
స్పందన ఆవిర్భావం
సాహితీ ప్రియుడు, కవి, రచయిత, సీనియర్ పాత్రికేయుడు దివంగత జీఆర్‌ఎన్ ఠాగూర్ స్పందన సాహితీ, సాంస్కృతిక సంస్థకు ఊపిరిపోశారు. అప్పట్లో కేవలం 18 మంది సభ్యులతో ఆవిర్భవించిన ఈ సంస్థ అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. న్యాయవాది కొత్తకోట ఆనందరావు కుముంధాన్ సంస్థకు ఆయువుపట్టుగా వ్యవహరించారు. ఆయన హయాంలో కళాకారులను ప్రోత్సహించడంతో పాటు సంస్థను ముందుకు నడిపించారు. ఆయన మరణానంతరం స్పందన సంస్థ బాధ్యతలను గుడ్ల గౌరీ శంకరరావు స్వీకరించి.. ఇప్పటికీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ సంస్థను నడిపిస్తున్నారు. ఎన్నో ఒడిదుడుకులను అధిరోహించి సంస్థను కాపాడుకుంటున్నారు. సంస్థ ఆవిర్భవించి 30 ఏళ్లు కావడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన మాటల్లో చెప్పారు.
అదృష్టంగా భావిస్తున్నాను
సాహిత్యం, కళారంగంపై నాకు ఎంతో ఆసక్తి ఉంది. అందువల్ల ఈ సంస్థను ముందుకు నడిపించాలనే ఉద్ధేశంతో నడుం బిగించాను. సంస్థకు చెందిన ఎంతోమంది సభ్యులు నాకు అండగా ఉండడం.. అన్ని రంగాల్లో సహకరించడంతో మూడు పదుల వసంతాలను నేడు జరుపుకునే సౌభాగ్యం కలిగింది. అయితే సాహితీ రంగం కనుమరుగువుతున్న నేపథ్యంలో దానిని బతికించేందుకు సంస్థ ఆవిర్భావకర్త జీఆర్‌ఎన్ ఠాగూర్ నడుం బిగించి సంస్థకు ఊపిరిపోశారు. దానిని పరిరక్షించే అవకాశం లభించడం గౌరవంగా భావిస్తున్నాను.
– గుడ్ల గౌరీ శంకర్ ప్రసాద్, స్పందన అధ్యక్షుడు
స్పందన సాహితీ, సాంస్కృతిక
సంస్థకు 30 ఏళ్లు
18 మందితో ప్రారంభమై
కళాకారులకు ప్రోత్సాహం
ఎంతో మందికి ఉన్నత స్థాయి
గుర్తింపు
కళలకు హృదయ స్పందన..!


