రాయగడలో ఎన్‌ఏసీ బృందం పర్యటన
రాయగడ: గంజాం జిల్లా చికిటి నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ (ఎన్‌ఏసీ)కి చెందిన కౌన్సిల్ బృందం రాయగడలో శనివారం పర్యటించింది. బృందంలో చికిటి ఎన్‌ఏసీ చైర్మన్ దీపా సాహు, వైస్ చైర్మన్ హరిప్రసాద్ చౌదరి, కౌన్సిలర్లు, కార్యనిర్వాహక అధికారి, డివిజనల్ ఇంజినీర్, స్వచ్ఛ సమయ్ కార్మికులు, సూపర్‌వైజర్లు తదితరుల ఉన్నారు. ముందుగా వారికి రాయగడ మున్సిపాలిటీ యంత్రాంగం స్వాగతం పలికింది. మున్సిపాలిటీ సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాయగడ మున్సిపాలిటీ యంత్రాంగం పట్టణంలో పారిశుద్ధ్య వ్యవస్థను ఎలా ఎదుర్కొంటుందో తెలుసుకున్నారు. దీనికోసం తీసుకుంటున్న చర్యలు, ప్రణాళికలకు సంబంధించి చర్చించారు. అనంతరం మున్సిపాలిటీ పరిధి 11వ వార్డు ఒంటరిగుడలో పర్యటించి, అక్కడ నిర్వహిస్తున్న మైక్రో కంపోస్ట్ సెంటర్ (ఎంసీసీ)ను పరిశీలించారు. ఇళ్ల నుంచి వస్తున్న వ్యర్థాలను సేకరించి వాటి ద్వారా మైక్రో కంపోస్ట్ ఎరువుల తయారీ ప్రక్రియను గురించి వివరించారు. అదేవిధంగా ఎఫ్‌ఎస్‌టీపీ ప్లాంటను సందర్శించారు. మున్సిపాలిటీ ద్వారా నిర్మించిన బిజూ పట్నాయక్ ఆడిటోరియం, ఆహార కేంద్రం, అశోక్ కల్యాణ మండపం, మహాత్మాగాంధీ పార్క్ తదితరమైనవి బృందానికి చూపించారు. పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు తీసుకుంటున్న భవిష్యత్ ప్రణాళికలు గురించి వివరించారు.
రాయగడలో ఎన్‌ఏసీ బృందం పర్యటన


