అసత్య ప్రచారాలు చేయడం సరికాదు
జయపురం: రెవెన్యూ అమలా సంఘంలోని పలువురు నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఒడిశా రాష్ట్ర అమలా సంఘ అదనపు కార్యదర్శి శశిభూషణ దాస్ మండిపడ్డారు. ఈ మేరకు స్థానిక యాదవ భవనంలో అమలా సంఘ జిల్లా శాఖ నిర్వహించిన పత్రికా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. జిల్లా అమలా సంఘ ఎన్నికలపై రెవెన్యూ అమలా సంఘ నేతలు కొందరు రాష్ట్ర అమలా సంఘాన్ని అబాసుపాలు చేసేలా మాట్లాడడంపై మండిపడ్డారు. అమలా సంఘ జిల్లా యూనిట్ కార్యవర్గం గడువు 2026 ఫిబ్రవరితో ముగియాల్సి ఉండగా.. రాష్ట్ర అమలా సంఘం కొరాపుట్ జిల్లా యూనిట్‌ను రద్దు చేయడంతో మరలా ఎన్నికల ప్రక్రియ ప్రారంభిచామని వెల్లడించారు. ఎన్నికలపై ఆరోపణ చేస్తున్నవారు ఒడిశా అమలా సంఘ సభ్యులుగా లేరన్నారు. ప్రస్తుత ఎన్నికల ప్రక్రియ ఈనెల 14వ తేదీతో పూర్తవుతుందన్నారు. సమావేశంలో మాజీ కార్యదర్శి సంజయ కుమార్ పండ, సభ్యుడు రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


