ఒడిశా ఆర్టీసీ బస్సు దగ్ధం
● తప్పిన ప్రాణపాయం
● ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ మాధవరెడ్డి
పాచిపెంట:
మండలంలోని పద్మాపురం పంచాయతీ రొడ్డవలస సమీపంలో ఘాట్ రోడ్డుపై గురువారం ఉదయం 7:30 గంటల సమయంలో ఒడిశా ఆర్టీసీ బస్సులో సాంకేతిక లోపం కారణంగా ఇంజిన్‌లో మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఒడిశా ఆర్టీసీ బస్సు విజయనగరం నుంచి బయల్దేరి పదిమంది ప్రయాణికులతో ఒడిశాలోని జయపూర్ వెళ్తోంది. అయితే పాచిపెంట మండలం పద్మాపురం పంచాయతీ, రొడ్డవలస సమీపంలో ఘాట్ రోడ్డు ఎక్కుతుండగా బస్సు స్లో అయిపోయింది. బస్సులో ఏదో సాంకేతిక సమస్య ఉన్నట్లు గుర్తించిన డ్రైవర్ బస్సు పక్కకు తీసి కిందికి దిగి ఇంజిన్ చెక్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేసి కిందకు దించేశాడు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది చేరుకుని మంటలు అదుపు చేశారు.అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది.
పరిశీలించిన ఎస్పీ
బస్సు దగ్ధమైన సంఘటన స్థలాన్ని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి స్థానిక పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను డ్రైవర్‌ను అడిగి తెలుసుకున్నారు. సాంకేతిక లోపమేనా? ఇంకేమైనా కారణం ఉందా? అన్న విషయంపై కేసు నమోదు చేసి పూర్తి దర్యాప్తు చేపట్టాలని స్థానిక పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు. ఎస్పీ వెంట జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి, జిల్లా రవాణా శాఖ అధికారి ఉన్నారు.


