జనాభా గణనకు సన్నాహాలు
భువనేశ్వర్: త్వరలో ప్రారంభమవ్వనున్న జనాభా గణన – 2027 సన్నాహాలు చురుకుగా సాగుతున్నాయి. ఈ చర్యల్లో భాగంగా రెవెన్యూ మరియు విపత్తు నిర్వహణ విభాగం అన్ని జిల్లా కలెక్టర్లు మరియు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లను వారి జిల్లాలు మరియు కార్పొరేషన్ల పరిధిలో ప్రముఖ గణాంక అధికారులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం అధికార పరిధిలో జనాభా గణన కార్యకలాపాలను పర్యవేక్షించే బాధ్యతను జనాభా గణన అధికారులకు కేటాయించారు. 1990 జనాభా గణన నియమ నిబంధనల ప్రకారం ఈ నియామకం చేసినట్లు పేర్కొన్నారు. జనాభా గణన ప్రక్రియ విజయవంతం కావడంలో అధికారులు కీలక పాత్ర పోషిస్తారు.
సురేష్ దాస్ మృతి తీరని లోటు
జయపురం: జయపురం సాహిత్య పరిషత్ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ సురేష్ దాస్ మృతి సాహిత్య రంగానికి తీరని లోటని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో సురేష్ దాస్ సంతాప సభను సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జయపురం సాహిత్య పరిషత్ కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సాహిత్యకులు లక్ష్మీకాంత పాఢీ, శ్రీకాంత మిశ్ర, డాక్టర్ ప్రదీప్ మిశ్ర. నరసింగ పాణిగ్రహి, జి.బి.రావు, కృష్ణచంద్ర తదితరులు పాల్గొన్నారు.
వ్యభిచార గృహంపై దాడి.. నలుగురు అరెస్టు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి సదరు పాత్రోగూడ గ్రామం వద్ద ఓ అద్దె ఇంటిలో వ్యభిచారం జరుగున్నట్లు మల్కన్‌గిరి ఎస్‌డిపీఓ దివ్య దళైకు సమాచారం రావడంతో ఐఐసీ రీగాన్‌కీండో తన సిబ్బందితో శనివారం రాత్రి ఆ ఇంటిపై దాడి చేశారు. ఆ సమయంలో ఇద్దరు వేశ్యలు, ఇద్దరు కస్టమర్లు ఉన్నారు. మొత్తం నలుగురిని అరెస్టు చేసి మల్కన్‌గిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆదివారం వారిని విచారించగా ఓ మహిళ, మరో పురుషుడు దీని వెనుక ఉన్నట్లు తెలిసింది. వారిని కూడా ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. యువతులు జగత్‌సింగ్‌పూర్, భద్రక్ జిల్లాలకు చెందినవారు. కస్టమర్లు చత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమాకు చెందిన వారు.


