జనవరి 2 నుంచి పుష్యపుణి పర్వ మహోత్సవాలు
● ఉత్సవ కమిటీ నిర్ణయం
జయపురం: కొరాపుటియ కళ, కళాకార సంఘం ద్వారా జయపురంలో ఏటా నిర్వహించే పుష్యపుణి పర్వ్ మహోత్సవాలను ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించేందుకుక ఉత్సవ కమిటీ నిర్ణయించింది. 2026 జనవరి రెండో తేదీ నుంచి ఉత్సవాలను ప్రారంభించేలా కార్యాచరణ సిద్ధం చేశారు. స్థానిక పవర్ హౌస్ కాలనీ గీతాంజలి మండపంలో కొరాపుట్ కళ, కళాకార సంఘ సాధారణ కార్యదర్శి, ప్రముఖ సంగీత కళాకారుడు ధిరెన్ మోహణ పట్నాయక్ నేతృత్వంలో శుక్రవారం కళాకారుల సమావేశం జరిగింది. సంఘ అధ్యక్షులు మనోజ్ పాత్రో అధ్యక్షత జరిగిన సమావేశంలో జనవరి ఒకటి నుంచి తొమ్మిదో తేదీ వరకు పుష్యపుణి మహోత్సవాలు జరిపేందుకు నిర్ణయించింది. ఉత్సవాలను గతంలో కంటే ఘనంగా.. నూతన కళాంశాలు చేర్చి ప్రజలను రంజింప చేయాలని నిర్ణయించారు. మహోత్సవంలో ప్రాంతీయ చిన్న సినిమాలు, నాటక పోటీలు నిర్వహించాలని సమావేశం తీర్మానించింది. ఆదివాసీ సంగీత, నృత్య పోటీలు నిర్వహించి ఆదివాసీ కళాకారులకు ఉత్సాహ పరచివారిని ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి ప్రసిద్ధ కళాకారులను ఆహ్వానించడంతో పాటు స్థానిక కళాకారులు, ఆదివాసీ కళాకారులకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు కార్యదర్శి ధిరెన్ మోహన్ పట్నాయక్ వెల్లడించారు. పుష్యపుణి మహోత్సవాలు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల విశాల క్రీడా మైదానంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పుష్యపుణి మహోత్సవాలకు దేశంలో ప్రముఖ వ్యాపార సంస్థలను ఆహ్వానించి వారి ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించేందుకు స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మహోత్సవాలు నిర్వహణ బాధ్యతలు నిర్వహించేందుకు కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. సమావేశంలో జయపురం ప్రముఖ సీనియర్, జూనియర్ కళాకారులు పాల్గొన్నారు. వారిలో గుప్తేశ్వర పాణిగ్రహి, కమళాకాంత రథ్, ప్రయూష్ పట్నాయక్ జయంత దాస్, శ్రీకాంత దాస్, మహమ్మద్ షరాఫ్, రామనాథ్ త్రిపాఠీ, సుధాకర పట్నాయక్, పద్మ చరణ చౌధురి, పలువురు కళాభిమానులు, పాత్రికేయులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
జనవరి 2 నుంచి పుష్యపుణి పర్వ మహోత్సవాలు


