అవినీతి నిర్మూలనకు కృషి చేయాలి
● విజిలెన్స్ ఎస్పీ ప్రదీప్ కుమార్ ప్రధాన్
పర్లాకిమిడి: అవినీతి అన్ని శాఖల్లో ఉందని.. దీన్ని పూర్తిగా అంతమోందించలేక పోయినా కనీసం నిర్మూలనకు మనందరం పాటుపడదామని బరంపురం విజిలెన్సు (దక్షిణ మండలం) సర్కిల్ ఎస్పీ ప్రదీప్ కుమార్ ప్రధాన్ అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాల్‌లో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి అవినీతి నివారణ సచేతన వారోత్సవాల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఇటీవల ఓ ప్రభుత్వ అధికారి ఇంటిని సోదాచేయగా 115 రెసిడెన్స్ ప్లాట్లు, కోట్లాది రూపాయలు, బంగారం బయటపడ్డాయని అన్నారు. లంచం ఇచ్చినా.. పుచ్చుకున్నా సమాజంలో నేరమని అన్నారు. దీనికి ప్రభుత్వ ఉద్యోగులు, సాధారణ పురప్రజలు 1064 టోల్ ఫ్రీ నంబర్, లేదా 0680 2282300కి ఫోను చేసి సమాచారం అందించాలని అన్నారు. జిల్లా ఎస్పీ పండా మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చే జీతభత్యాల కంటే అధికంగా డబ్బును ఆర్జించాలన్న స్వార్ధం ఉండకూడదన్నారు. ఉంటే అనేక అనర్ధాలకు దారితీస్తుందని అన్నారు. ఒక అధార్ కార్డు ఇవ్వడానికి ప్రభుత్వ ఉద్యోగులు నెలలు తరబడి తిప్పిస్తున్నారంటే అక్కడ అవినీతి వున్నదని సూచిస్తున్నదని జిల్లాకలెక్టర్ అన్నారు. అనంతరం అవినీతి నిర్మూలన సచేతన వారోత్సవాలు పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖనం, వక్తృత్వం, రచన పోటీలలో విజేతలకు జిల్లా కలెక్టర్, ఎస్పీ చేతులమీదుగా బహుమతి ప్రదానం చేశారు. అనంతరం జిల్లా ఏడీఎం మఝి ప్రభుత్వ ఉద్యోగులచే అవినీతికి పాల్పడనని ప్రమాణం చేయించారు. ఏ.డీఎం ఫల్గునీ మఝి, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహణ అధికారి శంకర కెరకెటా, డీఈవో డాక్టర్ మఽయాధర్ నాయక్ పాల్గొన్నారు.


