
విద్యుత్ సౌకర్యం కల్పించాలి
రాయగడ: జిల్లాలోని కల్యాణ సింగుపూర్ సమితి పరిధి నియమగిరి పర్వత ప్రాంతాల్లో డొంగిరియా తెగకు చెందిన ఆదివాసీలు నివసిస్తున్న పర్శాలి, సునాఖుంటి పంచాయతీ పరిధిలో దాదాపు 23 గ్రామాలు అంధకారంలో ఉన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తమకు విద్యుత్ వెలుగులు కల్పించాలని కోరుతూ డొంగిరియా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. మంగళవారం జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆయా పంచాయతీలకు చెందిన డొంగిరియాలు కలెక్టర్ అశుతోష్ కులకర్ణిని కలిసి తమ గోడును వినిపించారు. ఇదివరకు ఆయా గ్రామాల్లో సోలార్‌తో నడిచే విద్యుత్ వీధి ద్వీపాలను యంత్రాంగం ఏర్పాటు చేసిందని వినతిపత్రంలో వివరించారు. అయితే ఏర్పాటు చేసిన కొద్ది కాలానికే అవి మరమ్మతులకు గురవ్వడంతో నిరుపయోగంగా పడి ఉన్నాయని తెలిపారు. అందువలన శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సునాఖండి పంచాయతీకి చెందిన బొన కడ్రక, మహేశ్వర్ కడ్రక, ముధు వడక, పర్శాలి పంచాయతీకి చెందిన కృష్ణ సికక, కులసిక రాము పాల్గొన్నారు.