
రాష్ట్రంలో కొత్త పారిశ్రామిక యుగం
● 27 కొత్త పారిశ్రామిక ప్రాజెక్టులకు శంకుస్థాపన
భువనేశ్వర్: రాష్ట్రం సరికొత్త పారిశ్రామిక యుగం వైపు రాష్ట్రం పయనిస్తోందని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ఆనందం వ్యక్తం చేశారు. ఒడిశాను తూర్పు భారతదేశం యొక్క తయారీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అధునాతన, ప్రపంచ వ్యాప్త పోటీ ఉత్పత్తులపై దృష్టి సారించాలని పెట్టుబడిదారులు, భావి పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. సోమవారం ఆయన 12 జిల్లాల్లో 27 కొత్త పారిశ్రామిక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. స్థానిక ఓయూఏటీ కన్వెన్షన్ సెంటర్‌లో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. గంజాం, ఖుర్ధా, ఝార్సుగుడ, కొరాపుట్, అంగుల్ ప్రాంతాల్లో ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేసి ఇతర జిల్లాల్లోని సంప్రదాయ రీతిలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ పరిశ్రమలతో రాష్ట్రానికి రూ. 25,379 కోట్ల పెట్టుబడులు చేకూరుతాయి. రాష్ట్ర యువతకు 51,826 ఉద్యోగాలను సృష్టిస్తాయన్నారు. ఈ ప్రాజెక్టులు పునరుత్పాదక ఇంధనం, ఔషధాలు, వస్త్రాలు వంటి అధిక విలువైన రంగాలలో విస్తరించి ఉన్నవిగా పేర్కొన్నారు. రాష్ట్ర విధానాలు, దార్శనికతపై విశ్వాసంతో పెట్టుబడిదారులు ఔత్సాహికంగా ముందుకు వస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నుంచి 58 ప్రాజెక్టులు ఇప్పటికే 1,11,899 పైబడి ఉద్యోగాలను సృష్టించాయి. ఉపాధి ఆధారిత అభివృద్ధికి అచంచలమైన నిబద్ధతకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

రాష్ట్రంలో కొత్త పారిశ్రామిక యుగం