
అదనపు తరగతి గదులు ప్రారంభం
పర్లాకిమిడి: గజపతి జిల్లా కాశీనగర్‌లో బరంపురం ఎంపీ ప్రదీప్ పాణిగ్రాహి శనివారం పర్యటించారు. పర్లాకిమిడి సర్కూట్ హౌస్‌కు చేరుకున్న ఎంపీని బీజేపీ సీనియర్ నాయకులు ఛిత్రి సింహాద్రి, దారపు రాజేష్ కుమార్ స్వాగతం పలికారు. కాశీనగర్ సమితి కె.సీతాపురం పంచాయతీలో గల తరల గ్రామంలో పాఠశాల అదనపు తరగతి గదులను ప్రారంభించారు. అనంతరం ఖరడ పంచాయతీలో డి.జయపురంలో అంగన్‌వాడీ నూతన భవనం, శియ్యాలీ పంచాయతీలో ఎస్‌బీఐ బ్యాంకింగ్ సేవల భవనాలను ప్రారంభించారు. అనంతరం కాశీనగర్ నగరపాలక సంస్థ వద్ద త్రినాథి మండపంలో జరిగిన సమావేశంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం లబ్ధిదారులకు వర్క్ ఆర్డర్లను ఎంపీ ప్రారంభించారు. ఈ సమావేశంలో కాశీనగర్ నగర పాలక సంస్థ చైర్మన్ మేడిబోయిన సుధారాణి, కాశీనగర్ బీజేపీ అధ్యక్షుడు వి.చలపతి రావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు నళినీకాంత పాత్రో, డీఆర్‌డీఏ ముఖ్యకార్యనిర్వాహణ అధికారి శంకర్ కెరకెటా, కాశీనగర్ ఎన్.ఏ.సి.ఈ.ఓ. భాగవత్ సాహు, బీడీఓ డంబుధర మల్లిక్ తదితరులు పాల్గొన్నారు. కాశీనగర్‌లో సాధరణ ప్రజలు ఎదుర్కుంటున్న అనేక సమస్యలపై స్థానికులు ఎంపీకి వినతులు అందజేశారు. అనంతరం కాశీనగర్ పీహెచ్‌సీని ఎంపీ తనిఖీ చేసి ఆక్కడి సౌకర్యాలపై ఆరా తీఽశారు. కొంతమంది న్యాయవాదులు పర్లాకిమిడిలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని ఎంపీని కోరారు. గజపతి జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటుపై రాష్ట్ర ముఖ్యమంత్రి మోహాన్ మఝి దృష్టికి తీసుకువచ్చి బీజేపీ ప్రభుత్వ హాయంలో శంకుస్థాపన చేస్తామని ఎంపీ తెలియజేశారు.