
రాజ్యాంగాన్ని పరిరక్షించండి
● కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భక్త చరణ దాస్, పీసీసీ ప్రహరి అజయ లల్లు
జయపురం: కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం జయపురంలో నిర్వహించిన రాజ్యాంగాన్ని పరిరక్షించండి ర్యాలీకి, సమావేశానికి విశేష స్పందన లభించింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భక్త చరణ దాస్, పీసీసీ ప్రహరి అజయ లల్లును జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి, కొరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర ఉల్క స్వాగతం పలికారు. వీరి నేతృత్వంలో వేలాది మంది కార్యకర్తలు అంబాగుడ నుంచి 26వ జాతీయ రహదారిలో బైక్ రాలీలో జయపురం తీసుకువచ్చారు. పార్టీ రాష్ట్ర నేతలకు జయపురంలో ఘన స్వాగతం పలికారు. 26వ జాతీయ రహదారి పారాబెడ జంక్షన్‌లో గల డాక్టర్ అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. విక్రమ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసి బహిరంగ సభావేదిక వద్దకు చేరుకున్నారు. నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై నిప్పులు చెరిగారు. మోదీ పాలనలో రాజ్యాంగానికి ముప్పు వాటిల్లుతుందని, రాజ్యాంగ పరిరక్షణకు పార్టీ శ్రేణులు, ప్రజాస్వామ్యవాదులు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. సభా కార్యక్రమాలు జరుగుతుండగా భారీవర్షం పడటంతో కొంతసమయం అంతరాయం కలిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మీనాక్షి బాహిణీపతి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శశిభూషణ పాత్రో, తదితరులు పాల్గొన్నారు.