వెల్లువెత్తిన నిరసన సంతకం
ఇప్పటి వరకు సంతకాల సేకరణ ఇలా
విజయవాడ తూర్పులో రికార్డు స్థాయిలో..
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై ప్రజాగ్రహం
లబ్బీపేట(విజయవాడతూర్పు): నూతన వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజలు తమ సంతకాల ద్వారా నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి పెద్ద విశేష స్పందన లభిస్తోంది. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో సంతకాల సేకరణ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చి సంతకాలు చేసి ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో 60 వేల సంతకాలు సేకరించాలని వైఎస్సార్ సీపీ నాయకులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. శనివారం సాయంత్రానికి జిల్లాలో 4.11 లక్షల మంది ప్రజలు సంతకాలు చేశారు. ప్రజల స్పందనను చూస్తుంటే ఈ నెల 13వ తేదీ నాటికి లక్ష్యానికి మించేలా ఉందని ఆయా నియోజకవర్గాల వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జులు పేర్కొంటున్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జులతో పాటు పార్టీ నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు సంతకాల సేకరణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 13వ తేదీ నాటికి లక్ష్యాన్ని పూర్తి చేసే దిశగా సంతకాల సేకరణను ముమ్మరం చేశారు.
జగ్గయ్యపేట నియోజకవర్గంలో..
కోటి సంతకాల ప్రజా ఉద్యమానికి జగ్గయ్యపేట నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి వైద్య కళాశాలల ప్రైవేటీకరణను తమ సంతకాల ద్వారా వ్యతిరేకిస్తున్నారని తన్నీరు తెలిపారు. శనివారం నాటికి 60 వేలకు పైచిలుకు సంతకాలు సేకరించా మని తెలిపారు. పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొ న్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జగ్గయ్య పేట పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శనివారం పార్టీ నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ప్రజావ్యతిరేకత చాలా స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. వత్సవాయి మండలంలోని ఆళ్లూరు పాడు గ్రామంలో సంతకాల సేకరణ కార్యక్రమం శనివారం జరిగింది.
నందిగామ నియోజకవర్గంలో..
నందిగామ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్‌మోహనరావు, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణకుమార్ సారధ్యంలో సంతకాల సేకరణ ముమ్మరంగా జరుగుతోంది. ఇప్పటి వరకూ ఈ నియోజకవర్గంలో 52 వేల సంతకాల సేకరణ జరిగింది. కంచికచర్ల నెహ్రూబొమ్మ సెంటర్‌లో శనివారం సంత కాల సేకరణ జరిగింది. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్‌మోహనరావు మాట్లాడుతూ.. ప్రజారోగ్య వ్యవస్థను కాపాడాల్సిన ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసి పేద, మధ్య తరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని దూరం చేస్తోందని విమర్శించారు. పీపీపీ విధానంతో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. కంచికచర్ల మండలంలోని పరిటాల ముత్త వరపు వెంకటేశ్వరరావు ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం విద్యార్థుల సంతకాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ ఎ.రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ సారధ్యంలో రికార్డు స్థాయిలో 95 వేల సంతకాలు సేకరించారు. సంతకాల సేకరణ కార్యక్రమం ఈ నెల 13వ తేదీ వరకు కొనసాగనుంది. అయితే నవంబర్ 20వ తేదీ నాటికే లక్ష్యానికి మించి సంతకాల సేకరణ జరిగింది. అందుకు ప్రజల నుంచి లభించిన ఆదరణే నిదర్శనంగా చెప్పవచ్చు డివిజన్‌ల వారీగా పార్టీ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్‌చార్జులు శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజల నుంచి సంతకాలు సేకరించారు. దేవినేని అవినాష్ నిరంతర పర్యవేక్షణ, ప్రజల నుంచి ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకత వెల్లువెత్తడంతో లక్ష్యానికి మించి సంతకాలు సేకరణ సాధ్యమైంది.
వెల్లువెత్తిన నిరసన సంతకం


