కొత్త స్టాళ్ల ఏర్పాటు ప్రతిపాదనలు వాయిదా
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడి ప్రాంగణంలో ప్రస్తుతం ఉన్న స్టాళ్లనే తొలగిస్తుండగా, కొత్తగా రెండు స్టాళ్ల ఏర్పాటుకు వచ్చిన ప్రతిపాదనలను ట్రస్ట్ బోర్డు వాయిదా వేసింది. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ట్రస్ట్ బోర్డు శనివారం సమావేశమైంది. బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి ఆవరణలో ఉన్న బోర్డు సమావేశ మందిరంలో చైర్మన్, సభ్యులు, ఆలయ అధికారులు సమావేశమయ్యారు. చైర్మన్ రాధాకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో దుర్గగుడి ఈఓ శీనానాయక్, ఇంజినీరింగ్ అధికారులు, ఏఈఓలు, సూపరింటెండెంట్లు హాజరయ్యారు. మొత్తం 16 అంశాలు చర్చకు రాగా రెండు అంశాలను వాయిదా వేశారు. భవానీ దీక్ష విరమణ పనులకు సంబంధించి ఇంజినీరింగ్ విభాగం చేసిన ప్రతిపాదనలకు బోర్డు సభ్యులు ఆమోదం తెలిపారు. చర్చకు వచ్చిన అంశాల్లో 12 అంశాలు ఆమోదం పొందాయి. దుర్గాఘాట్‌లో టాయిలెట్లు, సి.వి.రెడ్డి చారిటీస్‌లో మెటీరియల్ స్టోరేజీ పాయింట్ ఏర్పాటు అంశాలను రివైజ్ చేయాలని తీర్మానించింది. కొండపై నుంచి రాళ్లు జారిపడకుండా చైనేజ్ మెస్ ఏర్పాటుకు ఇంజినీరింగ్ అధికారులు ప్రతిపాదన చేయగా, సభ్యులు సీఈడీ నివేదికకు పంపాలని నిర్ణయించారు. అనంతరం చైర్మన్ రాధాకృష్ణ, ఈఓ శీనానాయక్ మీడియాతో మాట్లాడారు.
సుచీ ఫుడ్ ప్రొడక్స్,
అరకు వ్యాలీ కాఫీ స్టాల్‌కు ప్రతిపాదన
దుర్గగుడి పరిసరాల్లో ఏపీ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్‌కు సంబంధించిన సుచీ ఫుడ్ ప్రొడక్ట్స్ స్టాళ్లు, గిరిజన కోపరేటివ్ కార్పొరేషన్‌కు చెందిన అరకు కాఫీ స్టాల్ ఏర్పాటుకు వచ్చిన ప్రతిపాదనలను ట్రస్ట్ బోర్డు సభ్యులు వాయిదా వేశారు. ఏడాదికి రూ.29 లక్షలు అద్దె చెల్లించే ప్రాతిపదికన వాటర్ బాటిళ్లు విక్రయించే కౌంటర్‌కే దేవదాయ శాఖ కమిషనర్ ఆమోదం తెలపకపోవడంతో ఆ స్టాల్‌ను దేవస్థానం తొలగించింది. ఇప్పుడు కొత్తగా స్టాళ్ల ఏర్పాటు తెరపైకి రావడంతో కొంతమంది ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనే ప్రచారం జరుగుతోంది.
35 లక్షల లడ్డూల తయారీకి ఏర్పాట్లు
భవానీ దీక్ష విరమణలకు ఈ ఏడాది ఆరు లక్షల మంది విచ్చేస్తారని అంచనా వేస్తూ ఏర్పాట్లు చేస్తున్నామని దుర్గగుడి ఈఓ శీనానాయక్ తెలిపారు. భక్తులు కోరినన్ని లడ్డూలు ఇవ్వాలనే భావనతో 35 లక్షల లడ్డూల తయారీకి అంచనాలు రూపొందించామన్నారు. మూడు హోమగుండాలు, 106 ఇరుముడి సమర్పణ కౌంటర్లలో గురు భవానీలు మాలల విరమణలు చేస్తారని వివరించారు. భవానీలను అన్ని క్యూలైన్లలో ఉచితంగా అమ్మవారి దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. గురు భవానీలు తప్పనిసరిగా దేవస్థానం వద్ద పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.


