హోంగార్డుల సేవలు అనిర్వచనీయం
లబ్బీపేట(విజయవాడతూర్పు): శాంతిభద్రతల పరిరక్షణ, ఇతర విధుల్లో హోంగార్డులు అందిస్తున్న సేవలు అనిర్వచనీయమని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు అన్నారు. పోలీసు శాఖకు వెన్నెముకలా నిలిచి ఉత్తమ సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. 63వ హోంగార్డ్స్ దినోత్సవం సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ గ్రౌండ్స్‌లో శని వారం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీపీ రాజశేఖరబాబుకు హోంగార్డులు పరేడ్ నిర్వహించి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. 1963 , డిసెంబర్ ఆరో తేదీన రాష్ట్రంలో హోంగార్డు వ్యవస్థ ప్రారంభమైందన్నారు. నాటి నుంచి ప్రజలకు హోంగార్డులు విశేష సేవలు అందిస్తున్నారని, పోలీస్ కమిషనరేట్‌లో వెయ్యి మంది ఉన్నారని వివరించారు. విధులు నిర్వహిస్తూ మృతి చెందిన హోంగార్డులకు సంబంధించి వారి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది నాలుగు కుటుంబాలకు ఎక్స్‌గేషియా చెల్లించి, ఆ కుటుంబాల్లో అర్హత ఉన్న వారికి హోంగార్డు ఉద్యోగం ఇచ్చామని పేర్కొన్నారు. ఈ ఏడాది ఉద్యోగ విరమణ చేసిన 13 మందికి రూ.5 లక్షల చొప్పున చెల్లించామన్నారు. హోంగార్డుల పిల్లలకు మెరిట్ స్కాలర్ షిప్‌లుకూడా అందిస్తున్నామని పేర్కొన్నారు.
సేవలకు గుర్తింపు
హోంగార్డుల సేవలు గుర్తించి కేంద్ర ప్రభుత్వ ఇచ్చే ఉత్కృష్ట, అతి ఉత్కృష్ట పతకాలు ఇప్పటి వరకూ 55 మందికి సీనియారిటీ ప్రాతిపదికన ఇచ్చినట్లు సీపీ రాజశేఖరబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు కృష్ణప్రసన్న, ఎస్.వి.డి.ప్రసాద్, హోంగార్డ్స్ కమాండెంట్ టి.ఆనందబాబు, క్రైమ్ ఏడీసీపీ రాజారావు, ఏఆర్ ఏడీసీపీ కె.కోటేశ్వరరావు, పలువురు ఏసీపీలు, సీఐలు, హోంగార్డ్స్’ ఆర్‌ఐ సుధాకర్‌రెడ్డి, 200 మంది హోంగార్డులు పాల్గొన్నారు.


