స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ స్ఫూర్తి ప్రదాత అని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంబేడ్కర్ వర్ధంతి కార్యక్రమం శని వారం జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి అంబేడ్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాజ్యాంగ రూపకల్పనకు విశేష కృషిచేసిన అంబేడ్కర్ వంటి మహనీయుల బాటలో యువత నడవాలని సూచించారు. దేశ ప్రజలకు అనుక్షణం తోడుగా, నీడగా నిలిచిన రాజ్యాంగ ఔన్నత్యాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. సమున్నత భారత రాజ్యాంగం చూపిన బాటలో నడిచి స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ సాధనకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎం.రమాదేవి, ఏఎస్‌డబ్ల్యూ గణేష్, కలెక్టరేట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


