బాబు సర్కారుపై యుద్ధానికి సిద్ధంకండి
మచిలీపట్నం టౌన్: రాష్ట్రంలో కొనసాగుతున్న దగాకోరు కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై యుద్ధానికి కార్యకర్తలు సిద్ధం కావాలని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా పిలుపునిచ్చారు. మచిలీపట్నంలోని పెడన రోడ్డులో ఉన్న జీ కన్వెన్షన్ హాల్లో సోమవారం యువజన విభాగం జూన్–3 కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జక్కంపూడి రాజా.. మాట్లాడుతూ గత ఎన్నికల ముందు చంద్రబాబు ప్రజలకు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారం వచ్చాక వాటిని అమలు చేయకుండా దగా చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న దగాను వివరిస్తూ ప్రజలను చైతన్య పరుస్తూ పలు ఉద్యమాలు నిర్వహించేందుకు యువజన విభాగం సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు..
కేంద్ర ప్రభుత్వానికి కీలకంగా ఉన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ప్రత్యేక హోదాను అడగకుండా వారి స్వార్థం కోసం, వ్యక్తిగత అవసరాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా తాకట్టు పెట్టారని రాజా విమర్శించారు. ఈ అంశంపై కూటమి ప్రభుత్వ పెద్దలను నిలదీయాల్సిన బాధ్యత పార్టీలకు అతీతంగా యువతపై ఉందన్నారు.
నియామకాలు పూర్తి చేయాలి..
జిల్లా, నియోజకవర్గం, మండలం, గ్రామ స్థాయి యువజన విభాగం సంస్థాగత కమిటీల నియామకాలను త్వరితగచ్చిన పూర్తి చేయాలని రాజా సంఘ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీలో ఇతర విభాగాల కన్నా యువజన విభాగం విభిన్నంగా, ఆకర్షణీయంగా కార్యక్రమాలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా సమస్యలపై పార్టీ ఇచ్చే పిలుపులో భాగంగా పలు రూపాల్లో ఉద్యమాలు చురుగ్గా నిర్వహించేందుకు యువజన విభాగం ఉత్సాహంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను.. మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేసిన మంచిని ప్రజలకు వివరించేందుకు యువజన శ్రేణులు ఉత్సాహంగా ముందుకు సాగాలన్నారు. తొలుత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి జక్కంపూడి రాజాతో పాటు యువజన విభాగం జోన్–3 వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్ని కృష్ణ మూర్తి (కిట్టు) పలు జిల్లాల యువజన విభాగం అధ్యక్షులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. యువజన విభాగం జోనల్ అధ్యక్షుడు కళ్లం హరికృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ పెడన నియోజవర్గ ఇన్‌చార్జ్ ఉప్పాల రాము, అవనిగడ్డ నియోజకవర్గం నాయకుడు సింహాద్రి వికాస్, యువ జన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు మెరుగు చెందాన్ నాగ్, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల యువజన విభాగం అధ్యక్షులు మెరు గుమాల కాళీ, కొరివి చైతన్య, ఆళ్ల ఉత్తేజ్ రెడ్డి, కందుల శ్రీకాంత్, కొక్కిలిగడ్డ చెంచయ్య ప్రసంగించారు. కార్యకర్తలు వారి సమస్యలను వాట్సాప్, ఫోన్ ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని పేర్ని కిట్టు సూచించారు.


