పర్యాటక అభివృద్ధికి ‘హోమ్ స్టే’ సువర్ణావకాశం
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పర్యాటక రంగ సుస్థిర అభివృద్ధికి హోమ్‌స్టేలు, బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ (బీఅండ్‌బీ) విధానాలు సువర్ణావకాశాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. స్థానిక ప్రజలకు ప్రత్యక్షంగా ఆర్థిక ఫలాలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. ఔత్సాహికులు రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక శాఖ హోమ్‌స్టేస్/బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ లక్ష్మీశ సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య హాల్‌లో రాష్ట్ర పర్యాటక విధానం – హోమ్‌స్టేలు, బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ విధానంపై సమన్వయ శాఖల అధికారులకు వర్క్‌షాప్ నిర్వహించారు.
అవగాహన కల్పించండి..
కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ పర్యాటకులు స్థానిక ఇళ్లలో ఆతిథ్యం, సంస్కృతీ సంప్రదాయాల ఔన్నత్యాన్ని తెలుసుకోవడం, స్థానిక ప్రత్యేక రుచులను ఆస్వాదించడం వంటివి ఈ హోమ్‌స్టే, బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ విధానాలతో వీలవుతుందన్నారు. రాష్ట్ర పర్యాటక పాలసీ(2024–29) ద్వారా ఈ రెండు విధానాలను అమలుచేయొచ్చని.. 2029 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పదివేలకు పైగా రిజిస్టర్డ్ హోమ్‌స్టేలను ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందన్నారు. గ్రామీణ హోమ్‌స్టేలు, గిరిజన హోమ్‌స్టేలు, పట్టణ హోమ్‌స్టేలు, వారసత్వ హోమ్‌స్టేలు తదితరాల ఏర్పాటు ద్వారా ఆయా యజమానులకు చేకూరనున్న విద్యుత్, నీటి సరఫరా, ఆస్తి పన్ను తదితరాల్లో రాయితీ ప్రయోజనాలు, రెండు దశల పరిశీలన ప్రక్రియ (పోలీస్ వెరిఫికేషన్, డీటీవో/పంచాయతీ కార్యదర్శి వెరిఫికేషన్), రిజిస్ట్రేషన్‌కు అవసరమైన పత్రాలు తదితరాలపై అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో పర్యాటక శాఖ ఆర్‌డీ వైవీ ప్రసన్నలక్ష్మి, టూరిజం మేనేజర్ రాజ్యలక్ష్మి, ఎన్‌టీఆర్ జిల్లా పర్యాటక అధికారి ఎ.శిల్ప, డీఆర్‌డీఏ, మెప్మా తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.


