అర్జీల సత్వర పరిష్కారానికి కృషి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా ఫిర్యా దుల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్) ద్వారా ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని డీఆర్వో లక్ష్మీనరసింహం అధికారులను ఆదేశించారు. సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పీజీఆర్‌ఎస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డీఆర్వో లక్ష్మీనరసింహం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి 149 అర్జీలు అందా యని చెప్పారు. వీటిలో రెవెన్యూ శాఖకు అత్యధికంగా 58 అర్జీలు అందాయని చెప్పారు. పోలీసు శాఖకు 19, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు 17 ఫిర్యాదులు వచ్చాయన్నారు. పంచాయతీరాజ్, వక్ఫ్ బోర్డులకు ఏడు చొప్పున, విద్యాశాఖకు ఆరు, సర్వే, ఆరోగ్యం, మత్స్య శాఖలకు నాలుగు చొప్పున, డీఆర్డీఏ, నైపుణ్య అభివృద్ధి, రిజిస్ట్రేషన్ –స్టాంపులు, జలవనరులు, పౌరసరఫరాలు, వ్యవసాయ శాఖలకు రెండు చొప్పున, అటవీ, గిరిజన సంక్షేమం, దేవదాయ, సాంఘిక సంక్షేమం, ఐసీడీఎస్, బీసీ కార్పొరేషన్, అగ్నిమాపక శాఖలకు ఒక్కొక్కటి చొప్పున అర్జీలు అందినట్లు తెలిపారు. వీటి సత్వర పరిష్కారంపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జ్యోతి, అన్ని శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
నేడు మైలవరంలో పీజీఆర్‌ఎస్..
మైలవరం నియోజకవర్గస్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం ఈ నెల 2వ తేదీ మంగళవారం జరగనుందని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా హాజరయ్యే ఈ కార్యక్రమం మైలవరంలోని ఎస్‌వీ కల్యాణ మండపంలో మధ్యాహ్నం 2 గంట ల నుంచి 5గంటల వరకు జరుగుతుందన్నారు. నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
డీఆర్వో లక్ష్మీనరసింహం


