ఎయిడ్స్ రహితంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుదాం
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
భవానీపురం(విజయవాడపశ్చిమ): రాష్ట్రాన్ని 2030 నాటికి ఎయిడ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. వరల్డ్ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా రాష్ట్రం ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వ్యాధి నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల వల్ల గతంలో ఉన్న 2.34 శాతం పాజిటివిటీ రేటు 10 ఏళ్లలో 0.58 శాతానికి తగ్గిందని తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో హెచ్‌ఐవీ పరీక్షలు చేసేందుకు కేంద్రప్రభుత్వ సహకారంతో 15 మొబైల్ ఐసీటీసీలను రాష్ట్రానికి తీసుకురాగలిగామని చెప్పారు. అయినా దేశంలో రాష్ట్రం రెండో స్థానంలో ఉండటం దురుదృష్టకరమన్నారు.
అవగాహన ఉంటేనే..
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిపట్ల పూర్తి అవగాహన ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ నీలకంఠారెడ్డి మాట్లాడుతూ హెచ్‌ఐవీపై సమాజాన్ని చైతన్యవంతం చేసేందుకు ఏటా అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. సెకండరీ హెల్త్ డైరెక్టర్ కేబీఎన్ చక్రధర్‌బాబు, పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి, డాక్టర్ సమరం, డాక్టర్ మంజుల పాల్గొన్నారు. కళాక్షేత్రం ప్రాంగణంలో ఏపీ శాక్స్ ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్‌ను మంత్రి తిలకించారు. అనంతరం ఆయన ఎయి డ్స్ నిర్మూలనకు తమ వంతు కృషి చేస్తామని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. స్నేహ, వాసవ్య మహిళా మండలి, శాంతి కల్చరల్ అసొసియేషన్ సభ్యులు ప్రదర్శించిన కళాజాతాలు ఆహూతులను అలరించాయి.


