వీఐపీలకు ఒకలా.. టికెట్లపై మరోలా... | - | Sakshi
Sakshi News home page

వీఐపీలకు ఒకలా.. టికెట్లపై మరోలా...

Dec 2 2025 7:18 AM | Updated on Dec 2 2025 7:18 AM

వీఐపీలకు ఒకలా.. టికెట్లపై మరోలా...

వీఐపీలకు ఒకలా.. టికెట్లపై మరోలా...

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దేవస్థాన అధికారులు తీసుకుంటున్న పలు నిర్ణయాలు విమర్శలకు దారి తీస్తున్నాయి. అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు, వీఐపీలు, నూతన వధూవరులు వేద ఆశీర్వచనం అందుకోవాలని భావిస్తారు. ఇందులో నూతన వధూవరులకు దేవస్థానం ఉచితంగా వేద ఆశీర్వచనం అందజేస్తుండగా, వీఐపీలకు, ప్రముఖులకు దేవస్థానం వేద ఆశీర్వచనం అందజేస్తుంది. అమ్మవారి దర్శనం అనంతరం వెలుపలకు వచ్చే మార్గంలో మండపంలో ఆశీర్వచనం అందజేస్తారు. అదే సామాన్య భక్తులు అయితే రూ.500 టికెట్‌ కొనుగోలు చేయడం ద్వారా వేద పండితుల ఆశీర్వచనం పొందే అవకాశం కలుగుతుంది. అయితే సోమవారం నుంచి మండపం నుంచి ఆశీర్వచనాన్ని ఆలయం బయట రాజగోపురం పక్కనే లక్ష కుంకుమార్చన వేదిక వద్దకు తరలించారు. టికెటు కొనుగోలు చేసిన భక్తులకు మాత్రమే ఇక్కడ వేద ఆశీర్వచనం అందచేస్తున్నట్లు ఆలయ సిబ్బంది పేర్కొంటున్నారు. వీఐపీలు, చైర్మన్‌ సిఫార్సులపై వచ్చే వారికి మాత్రం అంతరాలయంలో వేద ఆశీర్వచనం అందజేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిపై భక్తుల నుంచి సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.

చైర్మన్‌, బోర్డు సభ్యులకు

వేరు వేరుగా చాంబర్లు

దుర్గగుడికి ఎప్పుడు చైర్మన్‌ నియామకం జరిగినా బోర్డు సభ్యులు ఆ కార్యాలయంలోనే ఉండేవారు. అయితే ప్రస్తుత చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ మాత్రం బోర్డు సభ్యులు తన చాంబర్‌లో ఉండేందుకు అంగీకరించలేదు. దీంతో దేవస్థాన అధికారులు బోర్డు సభ్యులకు పోలీస్‌ అవుట్‌ పోస్ట్‌ వద్ద ప్రత్యేకంగా చాంబర్‌ను ఏర్పాటు చేశారు. బోర్డు సభ్యుల కోసం వచ్చే వారిని చాంబర్‌ బయట కూర్చునేలా కుర్చీలను ఏర్పాటు చేశారు. చైర్మన్‌ తీరుపై బోర్డు సభ్యులు కినుక వహించి దేవస్థానానికి దూరంగా ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

తులాభారానికి సైతం స్థానచలనం

దేవస్థాన స్ట్రాంగ్‌రూమ్‌ వద్ద ఉన్న తులాభారాన్ని అధికారులు ఇటీవల బోర్డు సభ్యుల చాంబర్‌ వద్దకు తరలించారు. గతంలో ఉన్న ప్రదేశంలో భక్తులకు అవసరమైన సమాచారాన్ని దేవస్థాన మైక్‌ రూమ్‌ సిబ్బంది తెలిపేవారు. భక్తులు తులాభారంగా సమర్పించే బియ్యం, చిల్లర నాణేలు, పసుపు, కుంకుమ, పటికబెల్లం, బెల్లం ఇతర సరుకులను జాగ్రత్తగా దేవస్థాన స్టోర్‌కు అప్పగించే వారు. తాజాగా మార్పు చేసిన తులాభారం వద్ద దేవస్థాన సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోవడం, అక్కడ భక్తులు సమర్పించిన సరుకులు దారి మళ్లుతున్నట్లు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విమర్శలకు దారితీస్తున్న మార్పులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement